కొంతమంది పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు. వారి కోసం అప్పుడప్పుడు పాయసం చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఎప్పుడు సేమ్యా తోనే కాక ఇలా సొరకాయ తో కూడా పాయసం చేసుకోవచ్చు. ఇది చాలా రుచికరంగా ఉండటమే కాక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
సొరకాయ పాయసం తయారీకి కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, చిక్కటి పాలు 1 లీటర్, జీడిపప్పు, బాదం, యాలకుల పొడి, కస్టర్డ్ పౌడర్, నెయ్యి 2 స్పూన్లు, నానబెట్టిన సగ్గుబియ్యం ½ కప్పు, బెల్లం 1 కప్పు.
తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నెయ్యి వేయాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, బాదం వేసి గోల్డ్ కలర్ లోకి వచ్చే వరకు వేయించాలి. ఈ లోపు సొరకాయ తురుమును వాష్ చేయాలి. వాష్ చేయడం వల్ల సొరకాయ వాసన రాకుండా ఉంటుంది. వాష్ చేసిన తరవాత గట్టిగా నీరు అంతా బయటికి వెళ్ళేలా పిండుకోవాలి. కడిగిన సొరకాయ తురుమును నేతిలో వేయించాలి. సొరకాయ వేగిన తర్వాత పాలు పోసుకువాలి. పాలు మరిగేటప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. ఇది బాగా చిక్కగా ఉంటే కొద్దిగా నీరు కలుపుకోవచ్చు. బాగా దగ్గరకు వచ్చాక బెల్లం వేయాలి. కస్టర్డ్ పొడర్ కలపాలి. దీని వల్ల పాయసం చిక్కగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇది దగ్గరగా వచ్చాక యాలకుల పొడి కలిపిన తరువాత 5 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే సొరకాయ పాయసం రెడీ.
పోషక విలువలు: కేలరీస్ 181.5, ఫాట్ 2.7g, కొలెస్ట్రాల్ 6.1g, సోడియం 325.0mg, కార్బోహైడ్రేట్స్ 34.2g, ఫైబర్ 0 g, సుగర్స్ 6.3 g, ప్రోటీన్ 5.8 g, ఇంకా విటమిన్స్, మినరల్స్ .