వాము మనందరికి తెలుసు..కానీ వామాకు గురించి చాలామందికి తెలియదు. ఈ మొక్క వల్ల ఉపయోగాలు తెలిస్తే..కచ్చితంగా తెచ్చి ఇంట్లో పెంచుకుంటారు కూడా. ఈ ఆకును వివిధ ప్రదేశాలలో వివిధ రకాలైన పేర్లతో పిలుస్తుంటారు. రాయలసీమలో కప్పరిల్లాకు అని, ఆంద్రలో కర్పూరం చెట్టు అని, వాము ఆకు చెట్టు అని పిలుస్తారు. ఆకు వాసన విశిష్టమైనది, విశిష్ట గుణాలు కలది. వాము మొక్కను మన పెరట్లో సులభంగా పెంచవచ్చు ఆకుపచ్చటి దళసరి ఆకులుండే వాము మొక్క చూడచక్కగా ఉండి మంచి పరిమళాలు వెదజల్లుతుంది. ఇంటికి శోభనిచ్చే ఇది ఒంటికీ ఎంతో మేలు చేస్తుంది.
వాము ఆకును పచ్చిగా తినవచ్చు. వాము ఆకుతో బజ్జిలు, పచ్చడి వంటివి తయారుచేస్తారు. వాము ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. జీర్ణ సమస్యలు అయినా అజీర్తి, గ్యాస్,కడుపు ఉబ్బరం సమస్యలు, మలబద్దకం వంటివి దూరం చేసే శక్తి వాముఆకుకు ఉంది. వాము ఆకులను నమిలితే జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు. గ్యాస్ట్రిక్ జ్యూస్‌లను విడుదల చేయడంలో వాము ఆకు ఉపయోగపడుతుంది.
చిన్న పిల్లల్లో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గిస్తుంది. వాము ఆకులో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన గాయాలు,మచ్చలను తగ్గిస్తుంది.
చిన్నపిల్లల్లో వచ్చే కడుపునొప్పికి వాము ఆకు మంచి మందు. ప్రతి రోజు భోజనం అయ్యాక వాము ఆకును తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఆకలి తక్కువ ఉన్నవారిలో ఆకలి పుడుతుంది.
చిన్న పిల్లలకు వాము ఆకు రసంలో తేనే కలిపి ఇస్తే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.
వామాకులో ఎ, బి, సి విటమిన్లు, అమినో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం ఉన్నందున ఇది మంచి పోషకాహారం.
తలనొప్పి నివారణకు కూడా వాము ఆకు ఔషధంలా పనిచేస్తుంది. వాము ఆకుల్ని నొప్పి ఉన్న ప్రాంతంలో రుద్దితే తలనొప్పి తగ్గుతుంది.
ఏవైనా పురుగులు, కీటకాలు కుట్టినప్పుడు వాము ఆకుల్ని ఆ ప్రాంతంలో రుద్దినా విషం బయటకు వచ్చేస్తుంది.
వామాకులతో వేసే శనగపిండి బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి.
వామాకు నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.