కరోనా బారిన పడి ఇంట్లో చికిత్స తీసుకునే వారికి ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం ఉండదు. కానీ వారిలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోతుంటే మాత్రం ఆక్సిజన్‌ను అందించాలి. అయితే పరిస్థితి విషమిస్తుంటే కచ్చితంగా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందించాలి. ఈ క్రమంలోనే ఐసీయూలో చికిత్స తీసుకునే వారికి, హాస్పిటల్స్‌లో సాధారణ చికిత్స తీసుకునేవారికి ఆక్సిజన్ అవసరం అవుతుంది. అయితే కోవిడ్ బాధితులకు రోజుకు ఎంత మేర ఆక్సిజన్ అవసరం అవుతుంది ? అంటే…
మనం పీల్చే గాలిలో నైట్రోజన్ 78 శాతం, ఆక్సిజన్ 21 శాతం, మిగిలిన 1 శాతంలో ఇతర వాయువులు ఉంటాయి. అయితే కోవిడ్ బారిన పడి ఆక్సిజన్ లెవల్స్ తగ్గేవారికి నిమిషానికి పెద్ద మొత్తంలో ఆక్సిజన్ అవసరం అవుతుంది. అందువల్ల వారికి ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా ఆక్సిజన్‌ను అందించాలి. సిలిండర్లలో 93 శాతం ఆక్సిజన్ ఉంటుంది. ఈ క్రమంలో కోవిడ్ బాధితుడి పరిస్థితిని బట్టి అతనికి అవసరం అయ్యే ఆక్సిజన్ మోతాదు మారుతుంది.
సాధారణంగా ఒక వ్యక్తికి రోజుకు 11వేల లీటర్ల వరకు ఆక్సిజన్ అవసరం. అదే కోవిడ్ బారిన పడి ఆక్సిజన్ లెవల్స్ తగ్గేవారికి ఇంకా ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ అవసరం అవుతుంది. కొందరు పేషెంట్లకు నిమిషానికి 1 నుంచి 2 లీటర్ల ఆక్సిజన్ చాలు. కొందరికి నిమిషానికి 3-4 లీటర్ల ఆక్సిజన్ అవసరం అవుతుంది.
ఇక పరిస్థితి సీరియస్‌గా ఉన్న కోవిడ్ బాధితులకు అయితే నిమిషానికి 60 లీటర్ల వరకు ఆక్సిజన్ అవసరం అవుతుంది. అంటే గంటకు 3600 లీటర్ల ఆక్సిజన్ అవసరం అన్నమాట. ఇక కొన్ని కేసుల్లో పేషెంట్ కండిషన్‌ను బట్టి రోజుకు 86వేల లీటర్ల వరకు ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఇలా వ్యక్తిని బట్టి ఆక్సిజన్ అవసరం మారుతుంది. అయితే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు తక్కువ మోతాదులో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి కనుక ఐసీయూలో ఉన్నవారికి వాటి ద్వారా వచ్చే ఆక్సిజన్ సరిపోదు. కాబట్టి కచ్చితంగా ఆక్సిజన్ సిలిండర్లను పెట్టాలి.