తెలంగాణ ఆర్థికాభి వృద్ధిని దాయడం సరికాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియావేదిక ‘ఎక్స్’ లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాన్ని ఆర్థికంగా దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దామన్నారు. అయితే, ఆ పరిస్థితిని కాంగ్రెస్ మసిపూసి మారేడుకాయ చేస్తూ దృష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందిందని ఘాటు విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చాక కూడా బీఆర్ఎస్ పాలనపై అబద్ధపు ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ మానుకోలేదని ఆరోపించారు.
అయితే, 16వ ఆర్థిక సంఘం ముందు తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఉంచిన వివరాలు ఇందుకు అద్దం పడుతున్నాయని గుర్తుచేశారు.కాంగ్రెస్ తమ ప్రభుత్వ వైఫల్యాలను, ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేని దుస్థితిని కప్పిపుచ్చుకునేందుకు ప్రజల దృష్టిని మరల్చుతోందన్నారు. తమ అసమర్థ పాలన నుంచి ప్రజల డైవర్ట్ చేసేందుకు కొత్త అంశాలను ఎంచుకుని తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు.ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త.. అంటూ పోస్ట్ పెట్టారు.