నేపాల్‌ను భారీ వరదలు ముంచెత్తాయి.వరదల బీభత్సం కారణంగా ఇప్పటివరకు 112 మంది మృతి చెందినట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. నేపాల్ వ్యాప్తంగా మొత్తం 79 మంది గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. 3,000 మందికి పైగా ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 63 ప్రాంతాల్లో ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయన్నారు.
ఖాట్మండులో 226 ఇళ్లు నీటమునగగా.. దాదాపు 3,000 మంది భద్రతా సిబ్బందిని ముంపు ప్రాంతాల్లో మోహరించినట్లు నేపాల్ పోలీసు విభాగం పేర్కొంది.అయితే, గత కొన్నిరోజులుగా నేపాల్‌ను భారీ వరదలు చుట్టుముట్టాయి.చాలా ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. దీంతో అక్కడి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వరద బాధితులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు. ఈ వరదల ప్రభావం దేశంలోని బిహార్‌పై పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.