ఉత్తరాఖండ్‌లోని కమోలి జిల్లా చోటు చేసుకున్న ప్రకృతి విపత్తు కారణంగా ఎంతో మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కి పడింది. మంచు కొండలు విరిగిపోవడం వల్ల వచ్చిన భారీ వరదలకు ఏకంగా ఓ పవర్ ప్లాంట్ కొట్టుకుపోయిందంటే వరద ఏ స్థాయిలో వచ్చిందో ఇట్టే అంచనా వేయవచ్చు. అయితే ఈ విపత్తుపై నిపుణులు ఏమంటున్నారంటే..?
హిమాలయ పర్వతాల్లో భారీ నిర్మాణాలను చేపడుతుండడం వల్లే ఈ విపత్తు సంభవించిందని గ్రీన్ పీస్ ఇండియా సీనియర్ క్లైమేట్ అండ్ ఎనర్జీ క్యాంపెయినర్ అవినాష్ చాంచల్ వెల్లడించారు. హిమాలయ పర్వతాల సహజసిద్ధమైన వ్యవస్థను మనిషి దెబ్బ తీస్తున్నాడని, అందుకనే దానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయని అన్నారు.
ఇక మరో నిపుణుడు ఆంజల్ ప్రకాష్ స్పందిస్తూ.. ఆ విపత్తు ఏర్పడేందుకు గల కారణాలను ఇప్పుడే చెప్పలేమని, అందుకు గల పూర్తి కారణాలు తెలుసుకునేందుకు మరికొన్ని రోజుల సమయం పడుతుందని అన్నారు. అయితే వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వల్లే ఈ విపత్తు సంభవించినట్లు అర్థమవుతుందని తెలిపారు.
కాగా ఆ ఘటనలో 170 మంది గల్లంతు కాగా 7 మంది మృతదేహాలను వెలికితీశారు. ఈ క్రమంలో బాధితులకు సహాయం అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సహా అనేక బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. మరోవైపు ఉత్తరాఖండ్‌కు కేంద్రం సహాయం అందిస్తుందని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు ఇప్పటికే వెల్లడించారు.