వరకట్నం వేధింపులలో ఎంతోమంది మహిళలు బలవుతున్నారు. ఒకప్పటి కాలంలో వరకట్నం కోసం హత్యలు ఎన్నో జరిగాయి. నేటి కాలంలో ఎన్నో రకాల చట్టాలు అమలులోకి వచ్చినప్పటికీ ఏమాత్రం భయపడకుండా వరకట్నం కోసం టార్చర్ పెట్టడం, అతి కిరాతకంగా హత్యలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకీ ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నోయిడాలో కట్నం కోసం గర్భవతి అయిన భార్యను హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. వివరాల్లోకి వెళ్తే… శిల్పా(27) అనే వివాహిత మహిళ అనుమానస్పదంగా మృతి చెందింది.

ఆమెకు ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం శిల్ప 5 నెలల గర్భవతి. వరకట్నం కోసం తన భర్త, అత్తింటి వారు హత్య చేశారని శిల్పా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివాహానికి ముందే 15 లక్షల రూపాయలు, 15 తులాల బంగారం, ఓ భవనాన్ని కట్నంగా అడిగినట్లుగా శిల్ప కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గతంలోనే కట్నంగా వాటిని అప్పగించగా ఇప్పుడు మరోసారి వరకట్నం కోసం వేధించి తమ కుమార్తెను చంపినట్లుగా శిల్పా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. శిల్ప భర్తకు, అత్తమామలకు కఠినమైన శిక్షలు విధించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.