కట్టుకున్నవాడే కాలయముడై… .!

అనుమానం పెనుభూతమైంది.. కలకాలం కలిసి ఉండాల్సిన వాడే కాలయముడయ్యాడు. జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసి.. కట్టుకున్న ఇల్లాలి నిండు ప్రాణాల్ని బలిగొన్నాడు. అతి కిరాతంగా కొట్టి.. ఆపై మెడకు తాడు బిగించి ఊపిరి తీశాడు. విశాఖపట్నం జిల్లా పాయకరావు పేట మండలం నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న దుర్గా భవాని (26)ని భర్తే అతి దారుణంగా హత్య చేశాడని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.

murder
murder

పాయకరావుపేట మండలం పెద్దిపాలేనికి చెందిన చందక భవానికి 2008 ఏప్రిల్‌లో అంకంపేటకు చెందిన నాగళ్ల సింహాద్రితో వివాహం జరిగింది. అతను గోనె సంచులు కుట్టే పని చేసేవాడు. 2017లో భవాని కానిస్టేబుల్‌గా ఎంపికైంది. శిక్షణ పూర్తి చేసుకుని 2018 మేలో నక్కపల్లిలో పోస్టింగ్‌ పొందింది. స్టేషన్‌ ఎదురుగా ఉన్న క్వార్టర్స్‌లోనే కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం.

కాగా భవానికి వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో సింహాద్రి తరచూ ఆమెతో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం విధులు ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చిన భార్య సెల్‌ఫోన్‌ను చూడటానికి ప్రయత్నించాడు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈమేరకు ఆగ్రహానికి లోనైన సింహాద్రి భవానిని కొట్టి తన వద్ద ఉన్న తాడును మెడకు చుట్టి ఊపిరి తీశాడు. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడు. అదే తాడును శ్లాబు హుక్కుకు కట్టి ఉరేసుకున్నట్లు చూపించాడు. ఎవరడిగినా అమ్మ ఆత్మహత్య చేసుకుందని చెప్పాలని, పిల్లల్నీ బెదిరించాడు. అనంతరం పక్కనే ఉంటున్న ఏఎస్ఐ సంతోష్‌కుమార్‌కు అర్ధరాత్రి 1.30 గంటలకు తన భార్య ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు.

అమ్మమ్మ రాధకు పిల్లలతో ఫోన్‌ చేయించి అమ్మ ఆత్మహత్య చేసుకుందని చెప్పించాడు. భవానిని చూడటానికి వచ్చిన అమ్మమ్మకు పిల్లలు తర్వాత అసలు విషయం చెప్పారు. మృతురాలి ముఖంతో పాటు పలు చోట్ల వాపు, గాయాలు ఉండటంతో ఆమె తల్లి ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేశామని ఎస్‌ఐ ఎస్.విజయ్ కుమార్ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.