తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నిక పోరు మొదలైంది. టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తాజాగా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే బీజేపీలో చేరకముందే, ఆయన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ పోరులో టీఆర్ఎస్‌కు చెక్ పెట్టాలని ఈటల చూస్తుండగా, ఈటలని ఓడించి టీఆర్ఎస్ సత్తా చాటాలని చూస్తుంది. ఇప్పటికే ఈటల వర్గాన్ని టీఆర్ఎస్ తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుంది. అటు ఈటల సైతం, టీఆర్ఎస్‌లో కీలకంగా ఉన్నవారిని బీజేపీలోకి తీసుకొస్తున్నారు.
అయితే ఈటల భార్య రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి. దీంతో రెడ్డి ఓట్లు కూడా ఈటలకు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే అధికార టీఆర్ఎస్ రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన ప్రవీణ్‌రెడ్డి పేరుని టీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాకపోతే ప్రవీణ్ సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో ఏదైనా ఉన్నతమైన నామినేటెడ్ పదవిపైనే ఆసక్తితో ఉన్నట్లు సమాచారం.
అటు రెడ్డి వర్గంలో మంచి పట్టున్న కొత్త జైపాల్‌రెడ్డి పేరు కూడా తెరపైకి వస్తున్నది. అలాగే ముద్దసాని పురుషోత్తం రెడ్డి పేరును టీఆర్ఎస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పురుషోత్తం ఫ్యామిలీకి హుజూరాబాద్ నియోజకవర్గంపై మంచి పట్టుంది. ఇక బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెట్టుకోవాలని అనుకుంటే, ఆ వర్గంలో చాలామంది నాయకులు టీఆర్ఎస్ టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. మొత్తానికైతే హుజూరాబాద్‌లో రెడ్డి ఓటర్లు కీలకం కానున్నారని తెలుస్తోంది.