దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ గా తెలంగాణ డాక్టర్ నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ స్థాయికి ఎదిగిన మూడో ప్రముఖుడిగా హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల, ఆసుపత్రి డీన్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఎం.శ్రీనివాస్ ఘనత సాధించారు. దేశంలో అత్యున్నత వైద్య విద్యాసంస్థ దిల్లీ ఎయిమ్స్‌కు డైరెక్టర్‌గా నియామకమయ్యారు. ఈయన నియామకానికి కేంద్ర నియామక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది.
ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న రణ్‌దీప్ గులేరియా పదవీకాలం ముగిసిన నేపథ్యంలో కేంద్రం కొత్త డైరెక్టర్‌ను నియమించింది. శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసు వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఆ సంస్థ 16వ డైరెక్టర్‌గా డాక్టర్ శ్రీనివాస్ బాధ్యతలు చేపడతారు. ఇదివరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రొ.ఉలిమిరి రామలింగస్వామి, రాజమహేంద్రవరానికి చెందిన ప్రొ.పనంగిపల్లి వేణుగోపాల్ తెలుగు రాష్ట్రాల నుంచి దిల్లీ ఎయిమ్స్‌కు డైరెక్టర్‌లుగా సేవలందించారు. కష్టించి పనిచేయటం, సామాన్య జీవితం గడపడాన్ని ఇష్టంగా భావించే డా.శ్రీనివాస్‌ను దిల్లీలోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ డైరెక్టర్ పదవి ఆయన దరఖాస్తు చేయకుండానే వరించటం విశేషం.