హైదరాబాద్ మెట్రో సిబ్బంది తమకు జీతాలు పెంచాలంటూ నిరసన చేస్తుండగా దీనిపై మెట్రో నిర్వాహకులు స్పందించారు. సిబ్బంది చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. వారి సమస్యలు తెలుసుకోవడానికి చర్చలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. నగరంలో సమయం ప్రకారం మెట్రో రైళ్లు నడుస్తున్నాయని.. మెట్రో ఆపరేషన్ నిలిపివేసేందుకు సిబ్బంది విధుల్లోకి రాలేదని తెలిపారు.
మరోవైపు మెట్రో టికెటింగ్ సిబ్బందితో కియోలీస్ ఏజెన్సీ ప్రతినిధుల చర్చలు జరుపుతున్నారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో ఐదుగురు టికెటింగ్ సిబ్బందితో చర్చిస్తున్నారు. మెట్రో స్టేషన్ వద్ద ఉద్యోగుల ఆందోళన కొనసాగుతోంది. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వేతనాలు పెంచాలని, పలు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఉదయం నుంచి మెట్రో సిబ్బంది ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే.