కళలను కళాకారులను చిత్తశుద్ధితో ప్రోత్సహిస్తున్న ప్రజా ప్రభుత్వం మనదని, ఇకపై ప్రతి యేటా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భక్త రామదాసు గా పిలవబడే కంచర్ల గోపన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. రానున్న ఉగాది పండుగ రోజున గద్దర్ తెలంగాణ సినిమా అవార్డుల ప్రదానోత్సవం జరగనున్నదని ఆయన వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఎల్.బి.ఇండోర్ స్టేడియంలో శ్రీ భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి.

ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ, రోడ్లు
భవనాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్కలు పాల్గొని
జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. తమిళనాడు తిరువయ్యుర్ లో యేటా జరిగే త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు మాదిరిగా ఇక ప్రతి ఏటా తెలంగాణలో వాగ్గేయకారుడు భక్త రామదాసు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని మల్లు భట్టి విక్రమార్క హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, కళారంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఆయన అన్నారు.