సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి పర్యటన కొనసాగుతోంది. నేడు వనపర్తిలో ప్రజా పాలన ప్రోగ్రాంలో పాల్గొని, ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వనపర్తి అంటే తనకు ఎనలేని గౌరవం అన్నారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన వనపర్తికి, తెలంగాణకు కీర్తి తెచ్చేలా పని చేస్తానని తెలిపారు. గతంలో వనపర్తి రాజకీయాల్లో ధన ప్రభావం లేదని, గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి ఇక్కడి రాజకీయాలను కలుషితం చేశారని మండిపడ్డారు. వనపర్తి రైతులకు రూ.7 వేల కోట్ల రైతు రుణమాఫీ మంజూరు చేశామని.. కావాలంటే స్వయంగా బ్యాంకుకు వెళ్ళి చెక్ చేసుకోవచ్చని విపక్షాలకు సవాల్ విసిరారు. నియోజక వర్గంలోని ప్రజలకు ఉచిత కరెంట్ అందిస్తున్నామని, ఆడబిడ్డలకు రూ.500 కే ఉచిత సిలిండర్ అందిస్తున్నామని వెల్లడించారు.
మహిళలు ఎక్కడికి వెళ్లాలన్న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తున్నామని.. మహిళలకు ఆర్ధిక భరోసా అందించేందుకు కాంగ్రెస్ ఎన్నో పథకాలు చేపడుతున్నామని.. బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు ఇవి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మహిళా సంఘాలకు రూ.1000 వెయ్యి కోట్లు వడ్డీ రహిత రుణాలు అందిస్తున్నామని.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ధ్యేయం అన్నారు.