ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం తన ఫిర్యాదును ఉపసంహరించుకునేలా బెదిరించే ప్రయత్నం చేస్తోందని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఆదివారం అన్నారు. పార్టీ నాయకులు, ఇతర వాలంటీర్లు నా క్యారెక్టర్పై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీని వలన అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆమె తెలిపారు. ముఖ్యంగా యూట్యూబర్ ధ్రువ్ రాథీ నాకు వ్యతిరేకంగా ఏకపక్ష వీడియోను పోస్ట్ చేయడంతో ఈ పరిస్థితి మరింత తీవ్రమైందని స్వాతి మలివాల్ అన్నారు. నా గురించి ధృవ్ రాతీ అసత్య ఆరోపణలతో వీడియో చేశాడు, అతన్ని సంప్రదించి అన్ని వివరాలు పంచుకోవాలని ప్రయత్నించినప్పటికీ అతను కాల్స్, మెసేజ్లను పట్టించుకోలేదని ఆమె తెలిపింది.
స్వతంత్ర జర్నలిస్టులమని చెప్పుకునే అతనిలాంటి వ్యక్తులు ఇతర ఆప్ ప్రతినిధుల్లా ప్రవర్తించడం సిగ్గుచేటు. నేను ఇప్పుడు తీవ్ర దుర్భాషలు, బెదిరింపులను ఎదుర్కొంటున్నాను. ఒక బాధితురాలిగా నన్ను అతను అవమానపరచడం సిగ్గుచేటు అని ఎక్స్లో ఆమె అన్నారు. మొత్తం పార్టీ యంత్రాంగం, దాని మద్దతుదారులు నన్ను దూషించడానికి, అవమానించడానికి, నాకు వ్యతిరేకంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ‘మహిళల సమస్యలపై వారి వైఖరిని ఇది తెలియజేస్తుంది. నేను ఈ అత్యాచారం, హత్య బెదిరింపుల గురించి ఢిల్లీ పోలీసులకు నివేదిస్తున్నాను. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అని మలివాల్ అన్నారు.