కరోనా వల్ల ఈ ఏడాది మార్చి 29 నుంచి జరగాల్సిన ఐపీఎల్ టోర్నీ రద్దయింది. దాంతో టోర్నీని బీసీసీఐ వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు టోర్నీ ఉంటుందో, అసలు జరుగుతుందో, జరగదో అన్న సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. అయితే టోర్నీ జరుగుతుందని, అక్టోబర్‌లో ఉంటుందని, షెడ్యూల్ ప్రకటించడమే తరువాయి అని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై బీసీసీఐ మాత్రం నోరు మెదపడం లేదు. మరోవైపు కరోనా వల్ల టీ20 వరల్డ్ కప్ జరిగే విషయంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి.
ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. కానీ ఆ టోర్నీని నిర్వహిద్దామా, వద్దా.. అనే విషయంపై ఐసీసీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇటీవలే పలు మార్లు ఐసీసీ సమావేశం అయింది. కానీ ఈ విషయంపై మాత్రం చర్చించలేదు. కాగా ఇటీవలే టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై తమ నిర్ణయాన్ని జూన్ 10 వరకు వాయిదా వేస్తున్నామని కూడా ఐసీసీ తెలిపింది. ఇక ఆ తేదీ కూడా రానే వచ్చింది. రేపటితో ఆ గడువు ముగియనుంది. దీంతో ఐసీసీ రేపు (బుధవారం) సమావేశమవుతుందా ? టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై చర్చిస్తుందా ? టోర్నీని నిర్వహిస్తారా, రద్దు చేస్తారా లేదా వాయిదా వేస్తారా ? ఏం చెబుతారు ? అనే విషయాలపై అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో రేపు ఐసీసీ నిర్వహించే సమావేశంపైనే అందరి కళ్లూ ఉన్నాయి.
అయితే ఐసీసీ మాత్రం టోర్నీని వాయిదా వేయాలనే ఆలోచనలోనే ఉన్నట్లు తెలిసింది. మరోవైపు ఐసీసీకి సంబంధించి పలు కీలక అంశాలపై కూడా రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇక రేపటి వరకు వేచి చూస్తే గానీ ఈ విషయంపై స్పష్టత రాదు.