ఎండాకాలంలో రోహిణి కార్తెకు ఉండే స్పెషలే వేరు. ఈ కాలంలో ఎండల వేడికి రోళ్లు కూడా పగిలిపోతాయ ని అంటారు. అయితే.. రాష్ట్రంలో రాజకీయ రోహిణి కార్తె ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. అంటే.. మైకులు పగిలిపోయేలా నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు.. ప్రతివిమర్శలు.. చేసుకునే సమయం వ చ్చేసింది. దీనికి గవర్నర్ తాంబూలాలిచ్చేస్తున్నారు. ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు లేదా వచ్చే నెల తొలి వారం వరకు కూడా ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.
అయితే, ఇటు అధికార పక్షం వైసీపీ, అటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇరువురూ.. ఈ దఫా మామూలుగా రెచ్చిపోరనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ పాలనకు ఏడాది పూర్తయిన నేపథ్యంలో తాము చేసిన అభివృద్ధిని ఏకరువు పెట్టేందుకు జగన్ టీం సన్నద్ధమవుతోంది. అంతేకాదు, గతంలో చంద్రబాబు రైతులకు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా చేసిన ఇన్‌పుట్ సబ్సిడీ.. సహా చిన్నతరహా పరిశ్రమలకు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా పోయిన వందల కోట్ల రాయితీలను జగన్ సర్కారు ఇటీవలే విడుదల చేసింది. అదేసమయంలో కరోనాను అత్యంత చాకచక్యంగా ఎదుర్కొన్న రాష్ట్రంగా కూడా ఏపీ నిలిచింది.
ఈ నేపథ్యంలో ఆయా అంశాలను అస్త్రంగా చేసుకుని ప్రతిపక్షంపై విరుచుకు పడే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ప్రతిపక్షం టీడీపీ కూడా ప్రభుత్వానికి హైకోర్టు నుంచి ఎదురవుతున్న తీర్పులను టార్గెట్ చేయ డంతో పాటు.. మండలి చైర్మన్ ఆదేశించిన సెలక్ట్ కమిటీ కోసం మండలిలోనే పట్టు బట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ వ్యవహారం సహా పేదల ఇళ్లు, ఇసుక వంటి విషయాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే.. ఇప్పటి వరకు జరిగిన సభలను మించి ఈ నెలలో ప్రారంభమయ్యే సభలు మరింత హీటెక్కుతాయని పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే.. రాజకీయ రోహిణి 16న మొదలని చెప్పుకొంటున్నారు.