ఇటీవల మేజర్ క్రికెట్ టోర్నీలకు వేదికలను ఖరారు చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. దీంట్లో 2025 జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ప్రస్తుతం దీనిపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాకిస్తాన్ లో టోర్నీ సాధ్యమంతుందా.. అని పలువురు క్రికెట్ లవర్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఐసీసీ స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ లో జరిగే తీరుతుందని ఐసీసీ ఛైర్మన్ గ్రేగ్ బార్క్ లే స్పష్టం చేశారు. టోర్నీని నిర్వహించే సత్తా పాకిస్తాన్ కు ఉందనే నమ్మకంతో ఆతిథ్యం హక్కులు ఇచ్చామని ఆయన వెల్లడించారు. గత రెండు దశాబ్ధాలుగా ఏ మేజర్ ఐసీసీ టోర్నమెంట్లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వలేదు. చివరి సారిగా 1996 వరల్డ్ కప్ కు ఇండియా, శ్రీలంకలతో కలిసి ఆతిథ్యం ఇచ్చింది. 2009లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదుల ధాడి జరగటంతో మరే దేశం పాకిస్తాన్ లో ఆడేందుకు సాహసించలేదు. ఇటీవల భద్రతా కారణాలతో న్యూజీలాండ్ కూడా పాకిస్తాన్లో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ కు వెళ్లలేదు.