ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఖాతాదారులకు ఆ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఆ బ్యాంక్ కస్టమర్లు తమ స్మార్ట్ ఫోన్లతోనే పేమెంట్లు చేయవచ్చు. ఇందుకు గాను ఆ బ్యాంక్ ఖాతాదారులు తమ తమ ఫోన్లలో బ్యాంక్ యాప్‌ను వాడుతుండాలి. అలాగే ఫోన్లలో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ) ఫీచర్ ఉండాలి. దీంతో డెబిట్ కార్డులను వెంట తీసుకెళ్లకుండా నేరుగా ఫోన్ ద్వారానే మర్చంట్ల వద్ద పేమెంట్లు చేయవచ్చు.
ఐడీఎఫ్‌సీ బ్యాంక్ ఈ ఫీచర్‌ను మరో వారం రోజుల్లో తన కస్టమర్లకు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. దీని వల్ల పూర్తిగా కాంటాక్ట్‌లెస్ పద్ధతిలో వినియోగదారులు పేమెంట్లు చేయవచ్చు. డెబిట్ కార్డులను వెంట తీసుకెళ్లాల్సిన పనిలేదు. ఫోన్‌లో ఉండే బ్యాంక్ యాప్‌ను ఓపెన్ చేసి అందులో పేమెంట్ మొత్తాన్ని నమోదు చేసి ఫోన్‌ను ఎన్ఎఫ్‌సీ సదుపాయం ఉండే మర్చంట్ పీవోఎస్ మెషిన్ వద్ద ఉంచాలి. దీంతో ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. దీని వల్ల కాంటాక్ట్‌లెస్ పద్ధతిలో పేమెంట్స్ చేయవచ్చు.
ఈ ఫీచర్ సహాయంతో ఆ బ్యాంక్ కస్టమర్లు ఒక ట్రాన్సాక్షన్‌కు గరిష్టంగా రూ.2వేలు పేమెంట్ చేయవచ్చు. అలాగే రోజు మొత్తం మీద దీంతో రూ.20వేల వరకు చెల్లింపులు జరపవచ్చు. ఫోన్లలో ఐడీఎఫ్‌సీ బ్యాంక్ యాప్‌ను వాడడంతోపాటు అందులో ఎన్ఎఫ్‌సీ ఫీచర్ ఉన్నవారు ఈ విధానం ద్వారా సులభంగా పేమెంట్లు చేయవచ్చని ఆ బ్యాంక్‌కు చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు.