అంబటి రాయుడు ఉండి ఉంటే.. భారత్ న్యూజిలాండ్‌పై సెమీఫైనల్లో గెలిచేద‌ట..?

-

మయాంక్ అగర్వాల్ స్థానంలో ఒకవేళ అంబటి రాయుడును జట్టులోకి తీసుకొని ఉంటే.. అతను న్యూజిలాండ్‌తో ఆడి ఉంటే.. టీం ఇండియా కచ్చితంగా గెలిచేదని భార‌త‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిని భారత క్రికెట్ అభిమానులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. టోర్నీ ఆరంభం నుంచి టీమిండియా అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడం అభిమానులకు నచ్చడం లేదు. దీంతో మ్యాచ్ జరిగి రెండు రోజులు దాటినప్పటికీ భారత అభిమానులు టీమిండియా ఓటమిని ఇంకా మరిచిపోలేదు. ఎక్కడ చూసినా ఈ విషయంపైనే అందరూ చర్చించుకుంటున్నారు. అసలు భారత్ ఓటమికి గల కారణాలు ఏమిటని తీవ్రంగా విశ్లేషిస్తున్నారు.

ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో గాయపడ్డ భారత ఆటగాడు విజయ శంకర్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమైన సంగతి తెలిసిందే. స్టాండ్ బై జాబితాలో ఉన్న అంబటి రాయుడును కాకుండా మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకోవడంపై మాజీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోవైపు వరల్డ్ కప్ టోర్నీలో ఆడాలని గంపెడాశలు పెట్టుకున్న అంబటి రాయుడు టీం మేనేజ్‌మెంట్ నిర్ణ‌యంతో తీవ్ర మనస్థాపం చెంది పూర్తిగా క్రికెట్‌కే గుడ్ బై చెప్పాడు. అయితే మయాంక్ అగర్వాల్ స్థానంలో ఒకవేళ అంబటి రాయుడును జట్టులోకి తీసుకొని ఉంటే.. అతను న్యూజిలాండ్‌తో ఆడి ఉంటే.. టీం ఇండియా కచ్చితంగా గెలిచేదని భార‌త‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రాయుడు ఉంటే భారత్ న్యూజిలాండ్ పై గెలిచి వరల్డ్ కప్ ఫైనల్ లోకి ప్రవేశించేద‌ని అంటున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన న్యూజిలాండ్‌లోని వెల్లింగ్ట‌న్‌లో న్యూజిలాండ్ తో జరిగిన వ‌న్డే మ్యాచ్ లో అంబటి రాయుడు 4వ‌ స్థానంలో వచ్చి 90 పరుగుల వ్య‌క్తిగ‌త స్కోరుతో టీమిండియా స్కోరును 250 దాటించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌ పై 35 పరుగుల తేడాతో ఘ‌న‌ విజయం సాధించింది. రాయుడు ఆ మ్యాచ్‌లో 113 బంతుల్లో 8 ఫోర్లు 4 సిక్సర్లతో 90 పరుగులు చేసి భారత్ విజయానికి బాటలు వేశాడు. అయితే న్యూజిలాండ్‌పై మంచి రికార్డు ఉన్న రాయుడు తాజాగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లోనూ న్యూజిలాండ్‌పై ఆడి ఉంటే ఇండియా క‌చ్చితంగా గెలిచి వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకునేద‌ని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినా ఇక ఇప్పుడు అంతా అయిపోయింది.. చేసేదేమీ లేదు కనుక.. వచ్చే వరల్డ్ కప్ వరకు భార‌త్‌ వేచి చూడాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Exit mobile version