దేశంలో వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టంపై సామాన్య ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో దీనిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేసారు. దీనికి 68 లక్షల మంది మిస్‌డ్ కాల్స్ ఇచ్చారని చెప్పిన ఆయన అందులో అత్యధికంగా పౌరసత్వ సవరణ చట్టానికి మద్ధతుగా 52, 72,000 మంది,
ఆ చట్టాన్ని సమర్ది౦చారని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం పౌరసత్వ సవరణ చట్టంపై భారతీయ జనతా పార్టీ, టోల్ ఫ్రీ నంబరుతో ప్రారంభించింది. దీనిపై స్పందించిన బిజెపి నేత అనీల్ జైన్ పౌరసత్వ సవరణ చట్టంపై అపోహలు తొలగించేందుకు వీలుగా ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా తాము టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేశామని వివరించారు.
88662 88662 నంబరుకు ఫోన్ చేస్తే చాలు పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే దీనిపై ఇప్పటికి దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ పలు చోట్ల హింసాత్మక సంఘటనలు కూడా జరుగుతున్నాయి. దీని విషయంలో తాము వెనక్కు తగ్గేది లేదని అమిత్ షా పేర్కొన్నారు.