ఏపీ ప్రభుత్వం మందు చూపు బెడిసి కొట్టిందా..? రేట్లు పెంచినంత మాత్రనా మద్యం నియంత్రణ సాధ్యమేనని అనుకున్న అంచనాలు తప్పుతున్నాయి. అలా అని ఏపీలో మద్యం కొనుగోళ్లు కూడా పెద్దగా జరగడం లేదు. పూర్వంలో ఎవరైనా తెలిసిన వారు పట్నం వెళ్లితే కావాల్సిన వస్తువులను తెప్పించుకున్న మాదిరిగా ఇప్పుడు ఆంధ్రా మందు బాబులు కాసింత నచ్చిన బ్రాండ్ మద్యం తెచ్చిపెట్టాలని కోరుతున్నారట. ఇది మర్యాదపూర్వకంగా జరుగుతున్న వ్యవహారం కాగా..ఈ సంప్రదాయాన్ని కొంతమంది వృత్తిగా మార్చుకునే పనిలో పడటం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్‌కు ఆనుకుని ఉన్న తెలంగాణ జిల్లాల నుంచి మద్యం తరలింపును కొంతమంది యథేచ్ఛగా చేపడుతున్నారు. ఈ విషయం ఇటీవల జరిగిన తనిఖీల్లో వెల్లడి కావడంతో పోలీస్, ఎక్సైజ్ శాఖలు కూడా ఏం చేయలేకపోతున్నారు. బస్సు ఎక్కి దిగుతూ నాలుగైదు బాటిళ్లకు మించకుండా… బస్సుకో నలుగురి చొప్పున పొద్దస్తమానం రవాణా చేయడమే పనిగా పెట్టుకుంటున్నారట. తనిఖీల్లో దొరికినా..ఇంట్లో ఫంక్షన్ ఉంది అందుకే అటుగా వెళ్లిన మేం తెచ్చుకుంటున్నాం అంటూ బుకాయిస్తున్నారట.
ఈ జవాబులు విన్న పోలీసులకు కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదట. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో అక్రమ మద్యం విపరీతంగా సేల్ అవుతుండటం గమనార్హం. ధర పెంచితే అమ్మకాలు తగ్గడం మాట అటుంచి…. ఇప్పుడు కూలి నాలి చేసుకుని జీవిస్తూ మద్యానికి బానిసలైనవారి జేబులు మరింతగా గుల్లవుతున్నారనే విమర్శలు ఊపందుకున్నాయి. రోజంతా కష్టపడి వచ్చిన కూలీలు తెచ్చిన డబ్బంతా కూడా తాగుడుకే తగిలేస్తున్నారని మహిళలు వాపోతున్నారు. మద్యం నిషేధం అన్నది అసాధ్యమని మొదటి నుంచి విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఇటీవల జరిగిన కేబినేట్ మీటింగ్‌లోనూ మంత్రి అవంతి శ్రీనివాస్ మద్యం ధరలను తగ్గించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని సూచన ప్రాయంగా కోరగా..సారీ అలా చేయడం కుదరదని మొహం మీద చెప్పేయడం విశేషం. ఇప్పుడు తెలంగాణ నుంచి డంప్ అవుతున్న మద్యాన్ని కట్టడి చేయలేకపోవడంతో ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తప్పవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రా మందుబాబులు జేబులకు చిల్లు పడుతుండగా..తెలంగాణ మద్యం దుకాణాల్లో గల్ల పెట్టల్లో గలగల పెరుగుతుండటం విశేషం.