తెలంగాణలో రోజురోజుకు అక్రమ మద్యం సరఫరా, గంజాయి సాగు, వాడకం, సరఫరా పెరుగుతున్నట్లు రాష్ట్ర ఆబ్కారీ శాఖ తెలిపింది. పండుగ వేళ వీటి సరఫరా మరింత పెరుగుతుందని భావించిన అధికారులు అక్రమ మద్యం, గంజాయి సరఫరాపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా సంగారెడ్డి, అదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణ పేట్ జిల్లాల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు నుంచి భారీగా సరఫరా అవుతున్నట్లు నిర్ధరించారు. ఇటీవల పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులు నమోదు చేసిన కేసులు, సీజ్ చేసిన పరిమాణం బట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు.
మరోవైపు ఇతర రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం, గంజాయి సరఫరాను నిలవరించడానికి రాష్ట్ర ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులు రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పటిష్ఠం చేశారు. ఈ మేరకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. దసరా పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా అప్రమత్త చర్యలు షురూ చేశారు.