త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వివాదస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ ను పార్లమెంట్ ఎన్నికల ముందు అమల్లోకి తేవడం చర్చనీయాంశంగా మారింది. 2019లోనే దీన్ని చట్టంగా మార్చిన కేంద్రం.. అప్పటి నుంచి విధివిధానాలను రూపొందించలేదు. ఇంకా నెల రోజుల్లో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో CAAను అమల్లోకి తెచ్చింది. దీంతో ‘గత నాలుగు సంవత్సరాలుగా కేంద్రం ఏం చేసింది?ఎన్నికలను ప్రభావితం చేసేందుకే ఇప్పుడు CAAను అమల్లోకి తెచ్చింది’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు.
ఈ చట్టం 2014 డిసెంబరు 31 కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ ,పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఈ చట్టంలో ముస్లింలను మినహాయించడంపై వివాదం రాజకుంది.1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ ప్రభుత్వం సవరణలు చేసి 2019లో చట్టంగా మార్చింది. అయితే పౌరసత్వం ఇచ్చేందుకు మతాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి.