హైదరాబాద్‌లో నేడు ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిన్న రాత్రే మహా గణపతికి చివరి హారతిని కూడా ఇచ్చారు. గణేశ్‌కు సంబంధించి అలంకరణ, సపోర్టింగ్ కర్రలు అన్నింటిని విడదీసి గంగమ్మ ఒడికి చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్ బడా గణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. అయితే, ట్యాంక్ బండ్ మీద వినాయకుల నిమజ్జనాలు చూసేందుకు వెళ్లాలని అనుకునే వారికోసం నగర పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ స్టేడియం, కట్ట మైసమ్మ ఆలయం, పబ్లిక్ గార్డెన్, నెక్లెస్ రోడ్డు, బుద్దభవన్ బ్యాక్ సైడ్, ఆదర్శనగర్ రోడ్డు (కళాంజలి షోరూం పక్కన), బీఆర్కే భవన్ , జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఖైరతాబాద్ జంక్షన్, ఎంఎంటీఎస్ ఖైరతాబాద్ స్టేషన్ వద్ద వాహనాలు పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.