పాకిస్థాన్ లో ఇమ్రాన్ ఖాన్.. ఇన్నింగ్స్ చివరి గట్టానికి చేరింది. పాక్ సుప్రీం కోర్టులో నుంచి బంతి పాక్ నేషనల్ అసెంబ్లీలో పడింది. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాసం ఎదుర్కోవాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాక్ ప్రతిపక్ష పార్టీలు పాక్ నేషనల్ అసెంబ్లీలో ఇచ్చిన అవిశ్వాసంపై నేడు ఓటింగ్ జరగనుంది. ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాసం తీర్మాణంపై ఓటింగ్ నేడు ఉదయం 10 : 30 గంటలకు జరగనుంది.
11 గంటల తర్వాత.. ఇమ్రాన్ ఖాన్ రాజకీయ భవితవ్యం తేలనుంది. అవిశ్వాసంపై శుక్రవారం.. పాక్ నేషనల్ అసెంబ్లీ అజెండా విడుదల చేసింది. ఆరు పాయింట్ల అజెండా లో నాలుగో అంశంగా అవిశ్వాస తీర్మాణం ఉంది. కాగ పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 342 ఉన్నాయి. అందులో మెజార్టీ నిరుపించుకోవడానికి 172 ఓట్లు అవసరం ఉంటాయి. కాగ ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ కు బలం 155 గా ఉంది. మిత్ర పక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇవ్వడంతో ఇమ్రాన్ ఖాన్ మెజార్టీ కోల్పోయాడు. 155 ఓట్లతో ఇమ్రాన్ ఖాన్.. అవిశ్వాస పరీక్షను ఎదుర్కొవడం కష్టమే అని చెప్పాలి.