ఉమ్మ‌డి లేఖ ఆంత‌ర్య‌మేమిటి… 2024 ఎన్నిక‌ల కూట‌మికి సంకేత‌మా?

-

2024 ఎన్నిక‌లు.. అన్ని పార్టీల టార్గెట్ ఇదే. ఎలాగైనా బీజేపీని ఓడించాలి. దేశంలోని విప‌క్షాలు దాదాపు కంక‌ణం క‌ట్టుకున్నాయి. కానీ.. ఒక‌రంటే ఒక‌రికి పొస‌గ‌దు. త‌లోదారి. అంద‌రూ ప్ర‌ధాని అభ్య‌ర్థులే. కానీ మొన్న‌టి ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు వాటికి క‌నువిప్పు క‌లిగించిన‌ట్లుగా అనిపిస్తోంది. పెట్రో మంట‌లు.. నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతుండ‌టం.. నిరుద్యోగం పెరిగిపోవ‌డం వంటి స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో ఈ రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురీత త‌ప్ప‌ద‌ని విప‌క్షాలు భావించాయి. కొన్నింటిలో అయితే బీజేపీకి ఓట‌మి ఖాయ‌మ‌ని కూడా అంచ‌నాలు వేసుకున్నాయి. అక్క‌డ ప్ర‌భుత్వాల ఏర్పాటుకు ప‌థ‌కాలూ ర‌చించాయి. కానీ అనుకున్న‌దొక్క‌టి. అయ్యింది ఒక్క‌టి. బొటాబొటీ మెజారిటీ కాదు క‌దా.. బంప‌ర్ మెజారిటీతో బీజేపీ అధికారాన్ని ద‌క్కించుకుంది. విప‌క్షాల అంచ‌నాలు బూమ‌రాంగ్ అయ్యాయి. పంజాబ్ మిన‌హా యూపీ. ఉత్త‌రాఖండ్‌, మ‌ణిపూర్, గోవాలో క‌మ‌లం విజ‌య‌నాదం మోగించింది. లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను నిర్దేశించ‌గ‌ల యూపీలో సూప‌ర్ మెజారిటీ సాధించింది.

ఈ ఫ‌లితాలు విప‌క్షాల‌కు దిమ్మ‌తిరిగేలా చేయ‌డ‌మేగాకా.. వాటి లోపాల‌ను బ‌య‌ట‌పెట్టేలా చేసింది. త‌త్వం బోధ‌ప‌డ‌టంతో ఇప్పుడు అవే విప‌క్షాలు ఏక‌మ‌య్యేందుకు య‌త్నిస్తున్నాయి. త‌మ‌ అనైక్య‌తే బీజేపీ బ‌ల‌మ‌ని గుర్తించి త‌మ ఇగోలు ప‌క్క‌న పెట్టి ఏక‌మ‌య్యేందుకు స‌మ‌యాత్త‌మ‌వుతున్నాయి. ఈ ప్ర‌క్రియ‌లో ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌ ప్రశాంత్‌ కిశోర్ కీలకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, అన్ని పార్టీల‌ను ఏకం చేసే బాధ్య‌తను ద‌గ్గ‌రుండి మోస్తున్నార‌ని ఢిల్లీ మీడియా కూడా పేర్కొంటోంది. పీకే డైరెక్ష‌న్ లోనే రెండు రోజ‌లు క్రితం 13 పార్టీలు ఐక్యంగా కేంద్ర ప్ర‌భుత్వానికి ఘాటైన లేఖ రాశాయి. కాంగ్రెస్ అంటేనే నిప్పులు చెరిగే టీఎంసీ అధినేత్రి మ‌మ‌తాబెన‌ర్జీ కూడా ఈ లేఖ‌పై సంత‌కం చేయ‌డం తీవ్ర‌త‌కు అద్దంప‌డుతోంది. యూపీ ఎన్నిక‌ల్లో ప‌ర‌స్ప‌రం తిట్టుకున్న కాంగ్రెస్‌, ఎస్పీ కూడా ఏక‌తాటిపైకి వ‌చ్చాయి. పంజాబ్ లో అధికార కాంగ్రెస్ ను ఓడించి పీఠ‌మెక్కిన ఆప్ కూడా గుజ‌రాత్ లో కాంగ్రెస్ తో పొత్తుకు రెడీ అంటోంది.

ఇక‌.. టీఆర్ఎస్‌, బీజేడీ, జేడీఎస్, టీడీపీ వంటి పార్టీలు ప్ర‌స్తుతానికి త‌ట‌స్థంగానే ఉన్నా భ‌విష్య‌త్తులో ఈ పార్టీల‌తో చేతులు క‌ల‌వ‌వు అనేందుకు ఎలాంటి గ్యారంటీ లేదు. అధికార‌మే ప‌ర‌మావ‌ధి అయిన‌ప్పుడు రాజ‌కీయాలు మారుతూనే ఉంటాయి. బ‌ద్ద‌శత్రువులు మిత్రులు కావొచ్చు. మిత్రులు శ‌త్రువులు కావొచ్చు. ఇందుకు అనేక ఉదాహ‌ర‌ణ‌లు మ‌న ముందు ఉన్నాయి. మహారాష్ట్రలో బీజేపీ-శివ‌సేన బంధం గురించి తెలిసిందే. ఒక‌ప్పుడు క‌లిసి అధికారం పంచుకున్న ఆ పార్టీలు ఇప్పుడు ఉప్పునిప్పుగా మారి క‌త్తులు నూరుకుంటున్నాయి. ప్ర‌స్తుత ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తుంటే బీజేపీని ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ పార్టీల‌న్నీ వ‌చ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌నాటికి ఏకమ‌వుతాయ‌ని, అన్నీ క‌లిసీ కమ‌లం టార్గెట్ గా బ‌రిలోకి దిగుతాయ‌ని రాజ‌కీయ‌పండితులు పేర్కొంటున్నారు. ఈ దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయ‌ని, సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి దీనిపై స్ప‌ష్టత వ‌స్తుంద‌ని అంటున్నారు. అయితే.. విప‌క్షాల మ‌ధ్య ఐక్య‌తపైనే ఇది ఆధార ప‌డిఉంటుంద‌ని ముక్తాయిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version