2019 ఫిబ్రవరి 26 న జరిగిన బాలకోట్ వైమానిక దాడుల్లో భారత్ 300 మంది ఉగ్రవాదులను చంపినట్లు ఒక ఇంటర్వ్యూలో పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త కీలక వ్యాఖ్యలు చేసారు. దౌత్యవేత్త ఆఘా హిలాలీ చేసిన ఈ ప్రకటన సంచలనంగా మారింది. సర్జికల్ స్ట్రైక్ నుండి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పాకిస్తాన్ సైన్యం చేసిన వాదనకు ఈ వ్యాఖ్యలు విరుద్ధంగా ఉన్నాయి.
ఫిబ్రవరి 26 న పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని బాలకోట్ వద్ద జైష్-ఎ-మొహమ్మద్ (జెఎమ్) ఉగ్రవాద శిక్షణా శిబిరంపై భారత వైమానిక దళం… వైమానిక దాడి నిర్వహించింది. పుల్వామాలో ఉగ్రవాదులు చేసిన దాడిలో 40 సిఆర్పిఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 14, 2019 జరిగిన దాడికి పాకిస్తాన్ కు చెందిన జెఎమ్ బాధ్యత వహించింది. దీనిని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది.
పాకిస్తాన్ దౌత్యవేత్త ఆఘా హిలాలీ మాట్లాడుతూ, “భారత్ అంతర్జాతీయ సరిహద్దును దాటి, కనీసం 300 మందిని చంపింది. మా లక్ష్యం వారి కంటే భిన్నంగా ఉంది. మేము వారి హైకమాండ్‌ను లక్ష్యంగా చేసుకున్నాము. అది మా చట్టబద్ధమైన లక్ష్యం” అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. 2019 ఫిబ్రవరిలో పుల్వామా దాడిలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ పాత్రను పాకిస్తాన్ మంత్రి అంగీకరించిన కొన్ని నెలల తరువాత ఈ ప్రకటన వచ్చింది.