2021 ఆరంభం వరకు భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌కు ఆమోదం..?

-

కరోనా వైరస్‌కు గాను దేశవ్యాప్తంగా ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లకు క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్న విషయం విదితమే. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు రూపొందించిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను భారత్‌లో పూణెకు చెందిన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా టెస్ట్‌ చేస్తోంది. ఈ వ్యాక్సిన్‌కు ఫేజ్‌ 2 క్లినికల్‌ ట్రయల్స్‌ ఇప్పటికే మొదలయ్యాయి. ఇక భారత్‌ బయోటెక్‌కు చెందిన కోవ్యాక్సిన్‌, జైడస్‌ కాడిలాకు చెందిన జై-కోవ్‌-డి వ్యాక్సిన్లకు కూడా ఫేజ్‌ 1 ట్రయల్స్‌ పూర్తి కాగా ఫేజ్‌ 2 ట్రయల్స్‌ చేపట్టనున్నారు. అయితే ఈ వ్యాక్సిన్లను తీసుకున్న వాలంటీర్లందరూ ఆరోగ్యంగా ఉండడం ఆశలు రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో భారత్‌లో 2021 ఆరంభం వరకు కరోనా వ్యాక్సిన్‌కు కచ్చితంగా ఆమోదం లభిస్తుందని ఓ నివేదిక వెల్లడించింది.

ప్రముఖ వాల్‌ స్ట్రీట్‌ రీసెర్చ్‌ అండ్‌ బ్రోకరేజ్‌ సంస్థ బర్న్‌స్టెయిన్‌ రీసెర్చ్‌ వెల్లడించిన నివేదిక ప్రకారం.. 2021 ఆరంభం వరకు భారత్‌లో అధికారికంగా ధ్రువీకరించి ఆమోదించబడిన వ్యాక్సిన్‌ ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో మూడు కరోనా వ్యాక్సిన్లు ఫేజ్‌ 2 దశలో ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటైనా సక్సెస్‌ అవుతుందని, దీంతో 2021 ఆరంభం వరకు భారత్‌లో ఆమోదించబడిన కరోనా వ్యాక్సిన్‌ ఉంటుందని అంచనా వేసింది.

కాగా ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థ సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ 2021లో 60 కోట్ల డోసులను తయారు చేయనుంది. 2022లో 100 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తుంది. వాటిలో 2021 ఆరంభంలో 40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు డోసులు భారత్‌కు సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ అందజేస్తుంది. ఇక వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌కు ఇప్పటికే గేట్స్‌ ఫౌండేషన్‌ సహాయం చేస్తోంది. ఈ క్రమంలో 2021లో భారత్‌లో సరికొత్త శుభారంభం జరుగుతుందని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version