భారత సరిహద్దుల్లో మన జవాన్లపై కవ్వింపు చర్యలకు పాల్పడడమే కాదు, 20 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నందుకు గాను చైనాపై ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందా..? అంటే అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. అందులో భాగంగానే భారత్ తన మిలటరీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ సామర్థ్యాలను మరింత పటిష్టం చేసుకుంటోంది. ఇక ముందు ముందు ఏర్పడబోయే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భారత్ తన ఎయిర్‌ఫోర్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రష్యా నుంచి ముందస్తుగా పలు యుద్ధ విమానాలను తెప్పించుకుంటోంది.
భారత్.. రష్యా నుంచి 21 MiG-29 విమానాలతోపాటు అత్యంత శక్తివంతమైన 12 సుఖోయ్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసింది. వీటిని రష్యా భారత్‌కు పంపించనుంది. ప్రస్తుతం చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో భారత్ ముందస్తు ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే ఎయిర్‌ఫోర్స్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు గాను భారత్ ఆయా విమానాలను రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఇక ఏ క్షణంలో అయినా రష్యా వాటిని మన దేశానికి పంపే అవకాశం ఉంది.
కాగా ఇప్పటికే భారత్ వద్ద మిగ్-29తోపాటు పలు సుఖోయ్ యుద్ధ విమానాలు ఉన్నాయి. అయినప్పటికీ చైనాకు బుద్ధి చెప్పాలంటే ఆ సామర్థ్యం సరిపోదు. అందుకనే భారత్ ఇప్పుడు ఆ దిశగా తన బలాన్ని పెంచుకునే పనిలో పడింది. అయితే రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఏర్పడుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.