చెన్నై టెస్ట్ చివరి రోజు ఏం జరుగుతుందన్నది ఉత్కంఠకి తెరదించుతూ టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను కట్టడిచేయడంతో.. మ్యాచ్‌పై భారత్‌కు ఆశలు చిగురించినా ఆఖరిరోజు టీమిండియా బ్యాట్స్ మెన్ వరుసగా పెవిలియన్ కి క్యూ కడుతున్నారు. సంచలనాలు జరిగితే తప్ప నాలుగోరోజుకే మ్యాచ్ పై ఆశలు వదులుకున్న భారత్ ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయింది.
ఆసీస్ పర్యటనలో అదరగొట్టిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పైనే టీమిండియా ఆశలు పెట్టుకుంది. భారత్‌కు ఫాలోఆన్ ఇచ్చే అవకాశమున్నా..బౌలర్ల అలసటను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. స్పిన్నర్ అశ్విన్ ధాటికి 178 పరుగులకే ఆలౌటైంది. 420 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది.
ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్.. ఆదిలోనే చతేశ్వర్ పుజారా వికెట్‌ను చేజార్చుకుంది. దాంతో భారత్ 58 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఒకే ఓవర్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ అజింక్య రహానే అవుటయ్యారు. రిషబ్ పంత్ కూడా ఔటవ్వడంతో 110 పరుగులకే 5 కీలక వికెట్లను కోల్పోయింది. దీంతో చెన్నై టెస్టుల్లో టీమిండియా ఓటమి అంచుల్లో చిక్కుకుంది.