భారత బౌలర్లు విజృంభించడంతో శ్రీలంక మూడో వన్డేలో ఓటమి పాలైంది. టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన సిరీస్ ను కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ సెంచరీలు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 390 పరుగులు చేసింది. దీంతో శ్రీలంకకు 391 పరుగుల భారీ టార్గెట్ ను నిర్దేశించింది.
అయితే లక్ష్య చేధనలో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక భారీ టార్గెట్ ను చేధించే క్రమంలో బ్యాటర్లు తడబాటుకు గురై ఒక్కొక్కరు వికెట్లు సమర్పించుకున్నారు. టీమిండియా బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ గా బంతులు వేయడంతో లంక బ్యాటర్లు టపా..టపా వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో లంక 73 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో లంక ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఒకానొక సమయంలో వికెట్లు కాపాడుకోవడమే కష్టంగా అనిపించింది. కొందరు బ్యాట్స్ మెన్స్ అయితే రెండంకెల స్కోరు చేయకుండానే వెనుదిరిగారు. 10 ఓవర్లకే ఆరు వికెట్లు కోల్పోయి లంక పీకల్లోతు కష్టాల్లో పడింది. సిరాజ్ దెబ్బకు లంక బ్యాటర్లు ఒక్కొక్కరు పెవిలియన్ కు క్యూ కట్టారు. సిరాజ్ ఖాతాలో కీలకమైన నాలుగు వికెట్లు పడ్డాయి. మహ్మద్ షమీ కూడా లంక బ్యాట్స్ మెన్స్ ను క్రీజులో కుదురుకోనివ్వకుండా బంతులు విసిరి రెండు వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్ రెండు వికెట్లను పడగొట్టాడు.