తమ అభిమాన హీరోల కోసం ఏం చేయడానికైనా ఫ్యాన్స్ వెనకాడరు. తమకు తెలిసిన విధానాల్లో అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఆ కథానాయకుల ఫ్లెక్సీలకు, కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం చేస్తుంటారు. ఇంకొంతమైంది అయితే ఏకంగా భిన్నమైన రీతిలో దేవాలయాలు కూడా కట్టించి పూజలు చేస్తారు. అయితే ఇప్పుడు ఇలాంటిదే సంఘటన మరొకటి జరిగింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌పై తమకున్న అభిమానాన్ని ఓ కుటుంబం కూడా ఇలానే వినూత్న రూపంలో చాటుకుంది. ఆయన కోసం ప్రత్యేకంగా తమ ఇంటిముందు ఓ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.
అమెరికా న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలోని ఇంటర్నెట్ సెక్యురిటీ ఇంజనీర్ గోపి సేథ్ అనే భారతీయ వ్యక్తి నివాసముంటున్నాడు. తనతో పాటు అతడి కుటుంబానికి కూడా బిగ్‌బీ అంటే విపరీతమైన అభిమానం. అందుకే అతడు బిగ్‌బీ స్టైల్‌గా కూర్చున్న రూపంలో ఓ విగ్రహాన్ని తన ఇంటి ముందు ఆవిష్కరించాడు. ఆ విగ్రహాన్ని ఓ పెద్ద గ్లాస్ బాక్స్‌లో ఉంచారు. గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకకు దాదాపు 600 మంది హాజరై సందడి చేశారు. బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. డ్యాన్స్‌లు వేస్తూ సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను గోపిసేత్ తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
“1991 న్యూ జెర్సీలోని నవరాత్రి ఉత్సవాల సమయంలో తొలిసారి బిగ్‌బీని కలిశాను. అప్పటి నుంచి ఆయనకు వీరాభిమానిని అయ్యాను. నాకు నా భార్యకు ఆయన దేవుడు లాంటి వారు. రీల్‌లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ఆయన మాట్లాడే విధానం, ఉండే విధానం నాలో ఎంతో స్ఫూర్తిని నింపింది. ఆయన ఉన్నత స్థాయికి ఎదిగిన ఒదిగి ఉండే మనిషి. తన అభిమానుల సంక్షేమాలు చూసుకుంటారు. మిగతా స్టార్స్‌లా కాదు ఆయన. ఎంతో ప్రత్యేకం. అందుకే నా ఇంటిముందు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం” అని గోపీ సేథ్ అన్నారు.