భారత జాతీయ పతాకాన్ని త్రివర్ణ పతాకం, మువ్వన్నెల జెండా అని కూడా పిలుస్తారు. ఈ జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు సమానమైన నిష్పత్తిలో ఉంటాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు.. ఎన్నో జాతులకు చెందిన ప్రజలు జీవిస్తున్నారు. ఒక్కో దేశానికి ఒక్కో జెండా ఉంటుంది. దాని వెనుక ఘన చరిత్ర ఉంటుంది. అలాగే మన జాతీయ జెండా వెనుక కూడా చెప్పుకోదగిన ఘన చరిత్రే ఉంది. దీంతోపాటు మన జాతీయ జెండాను ఉపయోగించే సమయంలో ఎలాంటి నియమ నిబంధనలను పాటించాలో కూడా ఒక్కసారి తెలుసుకుందాం.
భారతదేశానికి ఘనమైన చరిత్ర ఉంది. మన దేశాన్ని పుణ్యభూమి అని పిలుస్తారు. 250 ఏళ్ల కిందట మన దేశం ప్రపంచంలోకెల్లా అత్యంత ధనిక దేశంగా ఉండేది. మన దేశ ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తుండేవారు. కానీ అప్పుడు బ్రిటిష్ వారు వచ్చి మన దేశ సంపదను దోచుకున్నారు. దీంతో మనం సుమారుగా 200 ఏళ్ల పాటు బ్రిటిష్ వారి పాలనలో కష్టాలను అనుభవించాల్సి వచ్చింది. ఎంతో మంది ఆడపడుచుల మానప్రాణాలు పోయాయి. ఎంతో మంది సామాన్యులు చనిపోగా, ఎంతో మంది మహనీయులు దేశం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించారు. దీంతో వారి పేర్లు చరిత్రలో నిలిచిపోయాయి.
బ్రిటిష్ వారి రాక్షసపాలన నుంచి మన దేశం విముక్తిని పొందేందుకు ఎంతో మంది కొరడా దెబ్బలు తిన్నారు. ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. దీంతో చివరకు ఎట్టకేలకు బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా రెపరెపలాడింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆగస్టు 15వ తేదీన మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. మనకు స్వాతంత్ర్యాన్ని అందించిన మహానీయులను ఆరోజున గుర్తు చేసుకుంటున్నాం.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున మువ్వన్నెల జెండాను ఎగుర వేస్తూ మనం మన భారత జాతి ఔన్నత్యాన్ని నలు దిశలా చాటుతున్నాం. ఈ క్రమంలోనే జెండాలో ఉన్న ఒక్కో రంగు ఒక్కో విషయాన్ని మనకు తెలియజేస్తాయి. కాషాయ రంగు దేశ పటిష్టతకు, ధైర్యానికి ప్రతీకగా నిలిస్తే, మధ్యలో ఉండే తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది. కింద ఉండే ఆకుపచ్చ రంగు దేశ ప్రగతికి సూచికగా నిలుస్తుంది. ఇక మధ్యలో ఉండే అశోక చక్రం ధర్మాన్ని సూచిస్తుంది. కాగా భారత జాతీయ జెండాను 1947 జూలై 27వ తేదీన నిర్వహించిన రాజ్యాంగ సభలో మొదటగా ఆమోదించగా, ఆ తరువాత నుంచి అదే జెండాను మనం ఉపయోగిస్తూ వస్తున్నాం.
భారత జాతీయ పతాకాన్ని త్రివర్ణ పతాకం, మువ్వన్నెల జెండా అని కూడా పిలుస్తారు. ఈ జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు సమానమైన నిష్పత్తిలో ఉంటాయి. మధ్యలో 24 ఆకులతో ఆకాశనీలం రంగులో అశోక చక్రం ఉంటుంది. కాగా భారత జాతీయ పతాకాన్ని రూపొందించింది మన తెలుగు వాడైన పింగళి వెంకయ్య అవడం విశేషం. ఆయన రూపొందించిన జెండానే ఇప్పటికీ మనం వాడుతున్నాం. ఇక మన జాతీయ పతాకానికి సంబంధించి పలు నియమ నిబంధనలను మనం కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే…
1. కేవలం ఖాదీ, కాట్, సిల్క్ వస్త్రంతో మాత్రమే భారత జాతీయ జెండాను తయారు చేయాల్సి ఉంటుంది.
2. జెండా పొడవు, వెడల్పుల నిష్పత్తి కచ్చితంగా 3:2 లో ఉండాలి.
3. మన జాతీయ జెండాను 6300 x 4200 మిల్లీ మీటర్ల నుండి 150 x 100 మి.మీ. వరకు మొత్తం 9 రకాల సైజ్‌లలో తయారు చేసుకోవచ్చు.
4. జాతీయ జెండాను ఎగురవేసినప్పుడు అది నిటారుగా ఉండేలా చూడాలి. కిందకు వంచకూడదు. వంగితే సరిచేయాలి. అంతేకానీ తప్పుగా జెండాను ఎగురవేయకూడదు. అలాగే మన జాతీయ జెండాను ఎప్పుడూ తలదించుకున్నట్లుగా కాక తల ఎత్తుకున్నట్లుగా ఎగురవేయాలి.
5. ప్లాస్టిక్‌ను జెండా తయారీకి వాడకూడదు. కాకపోతే కాగితంతో జెండాలను తయారు చేసుకోవచ్చు. అది కూడా చిన్న సైజ్ జెండాలే అయిఉండాలి.
6. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ పై నుంచి కిందకు వచ్చేలా జెండాను ఎగురవేయాలి. అలాగే ఆ రంగులు సమాన కొలతల్లో ఉండాలి.
7. జెండాలో మధ్యలో ఉండే తెలుపు రంగు మధ్యలో అశోక చక్రం 24 ఆకులను కలిగి ఉండాలి. అది నీలం రంగులో ఉండాలి.
8. జాతీయ జెండాను ఎప్పుడూ సూర్యుడు ఉదయించాకే ఎగురవేయాలి. అలాగే సూర్యుడు అస్తమించకముందే జెండాను దించాలి.
9. జాతీయ జెండాను నేలమీద పెట్టకూడదు. నీటిలో వేయకూడదు. జెండాపై ఎలాంటి రాతలు రాయరాదు. అక్షరాలు కూడా ప్రింట్ చేయరాదు.
10. ఇతర జెండాలతో జాతీయ జెండాను ఎగుర వేయాల్సి వస్తే జాతీయ జెండా మిగతా జెండాల కన్నా కొద్దిగా ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. ప్రదర్శనల్లో జాతీయ జెండా మిగిలిన జెండాల కన్నా కొంచెం ముందుగానే ఉండేలా చూసుకోవాలి.
ఇక మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలించినప్పటి నుంచి స్వాతంత్ర్యం వచ్చే వరకు రక రకాల జెండాలను ఉపయోగించారు. వాటి గురించి కూడా తెలుసుకుందాం.
1. బ్రిటిష్ ఇండియా జెండా
భారతదేశాన్ని బ్రిటిష్ వారు పాలించినప్పుడు ఈ జెండాను ఉపయోగించారు.
2. కలకత్తా జెండా
1906వ సంవత్సరంలో అప్పట్లో బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అదే ఏడాది ఆగస్టు 7వ తేదీన అప్పటి కలకత్తా (ఇప్పుడు కోల్‌కతా)లో శచీంద్ర ప్రసాద్ బోస్ ఈ పతాకాన్ని రూపొందించారు. దీన్నే కలకత్తా పతాకం అంటారు.
3. మేడం భికాజీ కామా జెండా
1907వ సంవత్సరం ఆగస్టు 22వ తేదీన జర్మనీలో భికాజీ కామా జెండాను స్టుట్‌గార్ట్ ఎగురవేశారు. ఈ జెండాలో ఆకుపచ్చ రంగును ఇస్లాంకు, కాషాయాన్ని హిందూకు, బౌద్ధ మతాలకు సూచికగా వాడారు. ఈ జెండాను భికాజీ కామా, వీర సావర్కర్, శ్యాంజీ కృష్ణ వర్మలు కలిసి తయారు చేయగా మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఈ జెండాను భారతీయులు ఎక్కువగా వాడారు.
4. అనుమతించబడని జెండా
1931వ సంవత్సరంలో దేశంలో చోటు చేసుకున్న మత వివాదాలను పరిష్కరించడానికి అప్పట్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 7 మంది సభ్యులతో ఒక ఫ్లాగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 2న ఈ కమిటీ అప్పటి జాతీయ జెండాను పరీక్షించి అందులో ఉన్న కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు మతాలకు సూచికలుగా ఉన్నాయని చెప్పింది. దీంతో ఆ జెండా కాకుండా పూర్తిగా ఎర్రమట్టి రంగులో పై భాగంలో రాట్నం గుర్తు కలిగిన ఓ కొత్త జెండాను తయారు చేశారు. అయితే దీన్ని ఆ ఫ్లాగ్ కమిటీ ఆమోదించింది. అయినప్పటికీ ఈ జెండా ఇంకా మత భావజాలాన్నే సూచిస్తుందనే ఉద్దేశంతో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఈ జెండాను ఆమోదించలేదు.
5. పింగిళి వెంకయ్య జెండా
జాతీయ జెండాపై అనేక వివాదాలు నెలకొన్న నేపథ్యంలో మన తెలుగు వాడు పింగళి వెంకయ్య అప్పట్లో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో పట్టీలు, మధ్యలో రాట్నంతో జాతీయ జెండాను రూపొందించారు. కరాచీలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఈ జెండాను జాతీయ పతాకంగా ఆమోదిస్తూ తీర్మానం చేశారు.
6. భారత ఆర్మీ జెండా
మన దేశ జాతీయ పతాకాన్ని ఆమోదించిన తరువాత ఇండియన్ ఆర్మీ వారు ఆ పతాకంలో స్వల్ప మార్పులు చేశారు. మధ్యలో అశోక చక్రం తీసేసి మన జాతీయ మృగం పులిని అందులో చేర్చారు. కాషాయం, ఆకుపచ్చ రంగులపై ఆజాద్, హింద్ అనే అక్షరాలను ముద్రించారు. అయితే ఈ జెండాను సుభాష్ చంద్రబోస్ అప్పట్లో మణిపూర్‌లో ఆవిష్కరించారు. కానీ దీన్ని జాతీయ పతాకంగా ఆమోదించలేదు.
ఈ విధంగా మన జాతీయ పతాకం అనేక మార్పులు చెంది చివరకు ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న జెండాగా అవతరించింది. అయినప్పటికీ జాతీయ పతాకాన్ని మొదటగా తయారు చేసిన వాడిగా మన తెలుగువాడు పింగళి వెంకయ్య పేరు చరిత్రలో నిలిచిపోయింది.