కష్టం వెంటనే సుఖం సుఖం వెంటనే కష్టం, సో సుఖం వచ్చిందని పొంగిపోకూడదు, అలాని కష్టం వచ్చిందని కుంగిపోకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ విషయం అందరి విషయాల్లో జరిగిందో లేదో కానీ దేశం కాని దేశంలో ఉద్యోగం పోగొట్టుకుని బాధలో ఉన్న కేరళ కుర్రాడికి లక్కు లక్కీ డ్రాలో తగిలింది. విషయం ఏంటంటే దుబాయ్ లో కేరళకు చెందిన ఓ నిరుద్యోగ యువకుడికి బంపర్ డ్రా తగిలింది.
ఆదివారం ‘దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్’ లక్కీ డ్రా తీయగా.. నవనీత్ సంజీవన్ అనే కుర్రాడు 1 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.7.4 కోట్లు) గెలుపొందారు. అబుధాబి కేంద్రంగా పనిచేస్తున్న ఓ కంపెనీలో పనిచేస్తున్న నవనీత్ కొన్ని కారణాలతో గత నెలలో ఉద్యోగం కోల్పోయాడు. ప్రస్తుతం నోటీస్ పీరియడ్లో ఉన్నాడు. డిసెంబర్ 28తో అతను ఉద్యోగానికి గుడ్ బై చెప్పాల్సి ఉంది. ఇలాంటి సమయంలో రూ.7 కోట్ల లాటరీ తగలడంతో నవనీత్ ఆనందానికి అవధుల్లేవు.