కేసీఆర్ హయాంలో పాలమూరు గడ్డకు చాలా అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నాగర్కర్నూలు జిల్లా బిజినపల్లిలో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభలో మాట్లాడిన ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కరీంనగర్లో ఓటమి భయంతో కేసీఆర్ పాలమూరు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి జిల్లాకు అన్యాయం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. కరవు జిల్లాను కనీసం పట్టించుకోలేదు’ అని మండిపడ్డారు.
ఐపీఎస్ పదవికి RS ప్రవీణ్ కుమార్ రాజీనామా చేస్తే తాము అండగా నిలబడినట్లు ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడించారు. ‘దొరల పెత్తనం సహించలేక రాజీనామా చేస్తున్నానని ప్రవీణ్ అన్నారు. కేసిఆర్ కు వ్యతిరేకంగా కొట్లాడాలంటే ప్రవీణ్ కాంగ్రెస్లోకి రావొచ్చు కదా? దొరల పెత్తనమని చెప్పి.. మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోనే చేరారు.టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ గా నియమించాలని అనుకున్నాం. ఆయన తిరస్కరించారు. ఐపీఎస్ గా ఆయన ఉండుంటే.. డీజీపీని చేసేవాళ్లం’ అని తెలిపారు.