హైదరాబాద్ మలక్‌పేట ప్రాంతీయ ఆస్పత్రిలో ఇటీవల ఇద్దరు బాలింతలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. ఈ మేరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, పేట్లబురుజు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాలతిలతో కూడిన త్రిసభ్య కమిటీ విచారణను చేపట్టింది.
వారం క్రితం ఇద్దరు గర్భిణులు కాన్పు కోసం మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా సిజేరియన్ అనంతరం వారి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో వారిని గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న బాలింతలు మృతిచెందిన విషయం తెలిసిందే.
దీనిపై టీవీవీపీ కమిషనర్ ఇప్పటికే అంతర్గత విచారణ చేపట్టారు. బాలింతల మృతికి బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షనే కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. ఈ నివేదికను ప్రభుత్వానికి కూడా సమర్పించారు. అయితే ఫోరెన్సిక్ నివేదిక వస్తేనే కచ్చిత సమాచారం లభిస్తుందని వైద్యవర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై లోతుగా విచారించడానికి తాజాగా ఉన్నత స్థాయి బృందాన్ని నియమించిన ప్రభుత్వం వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.