ఔను.. జగన్ అంటే ప్రాణం పెట్టే ఆ మహిళా మంత్రికి తీవ్ర అవమానం జరిగిందా? అది కూడా ఆమె సొంత గడ్డపైనే అవమానించారా? అంటే.. ఔననే అంటున్నారు వైఎస్సార్ సీపీ నాయకులు. ప్రస్తుతం ఈ విషయం పార్టీలోనే హాట్ టాపిక్‌గా మారిందని చెబుతున్నారు. విషయంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి మేకతోటి సుచరిత వైఎస్సార్ సీపీలో కీలక నాయకురాలిగా ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్ అంటే ప్రాణం పెడతారు. పార్టీ కోసం ఎంతో శ్రమించారు. గత ఐదేళ్లలో పార్టీని డెవలప్ చేయడంతోపాటు.. జగన్ కుటుంబ సమస్యల్లోనూ భాగస్వామ్యం పంచుకున్నారు.
బహుశ ఈ నేపథ్యంలోనే జగన్ ఆమెకు గౌరవమిచ్చారు. ఏకంగా హోంశాఖను ఆమెకు అప్పగించారు. ఇంత ప్రాధాన్యం ఉన్న సుచరితకు సొంత జిల్లాలోనే అవమానం జరిగిందనే వార్తలు రావడంతో పార్టీలోను, జిల్లాలోనూ చర్చనీయాంశంగా మారింది. విషయం ఏంటంటే.. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెండు రోజుల కిందట `ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్` భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. దీనికి జగన్ ప్రభుత్వమే నిధులు కేటాయించింది. దీనిలోకొంత భాగం కేంద్రం కూడా సమకూర్చింది. అయితే, ఈ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించాలని.. ప్రభుత్వం ఆదేశించింది.
ఒక యూనివర్సిటీలో ఈ తరహా కార్యక్రమం నిర్వహించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి కావడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనికి సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆహ్వాన పత్రాలు ముద్రించారు. మీడియాకు కూడా ఆహ్వానాలు కూడా పంపించారు. అయితే, ఈ మొత్తం వ్యవహారం కూడా యూనివర్సిటీ ఇంచార్జ్ వైస్ చాన్సెలర్ నేతృత్వంలో సాగింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. సదరు ఆహ్వాన పత్రంలో జిల్లాకు చెందిన ఏకైక మంత్రి సుచరిత పేరు లేకపోవడం వివాదానికి దారితీసింది.
ఉద్దేశ పూర్వకంగానే ఆమె పేరు వేయలేదని ఆమె అనుచరులు గొడవకు దిగినట్టు సమాచారం. దీంతో ఈ విషయం పార్టీ అధిష్టానం వరకు వెళ్లడంతో కార్యక్రమానికి ఎవరూ వెళ్లవొద్దని ఆదేశాలు వచ్చాయి. ఫలితంగా కార్యక్రమం మొత్తం కూడా వీసీ చేతుల మీదుగా నిర్వహించి మమ అనిపించారు. అయితే, మంత్రికి జరిగిన అవమానం మాటేంటనేది చర్చనీయాంశంగా మిగలడం విశేషం.