ఒక నిర్ణయాన్ని అమలు చేయడం అనేది ప్రభుత్వానికి ఒక్కొక్కసారి ఎంత కష్టమవుతుందో తాజాగా ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలు, పరిస్థితులు నిరూపిస్తున్నాయి. ఏపీ రాజధాని విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సంపూర్ణంగా అమలు చేసేందుకే కేబినెట్ తీర్మానించిన విషయాన్ని కాన్ఫిడెన్షియల్‌గా ఉంచడం దగ్గర నుంచి ఇతర విషయాల ప్రకటన వరకు కూడా జగన్ సర్కారు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం అమరావతిలో మార్పు విషయంపై రైతులు, స్థానిక ప్రజలు కూడా భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇక, ఎలాగూ రాజధాని అంశం కాబట్టి.. రాజకీయ రంగు పులుముకుంది. దీంతో ఆందోళనలు కూడా ఊపందుకున్నాయి.
ఈ నేపథ్యంలో గడిచిన వారం పది రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. ఇక, ప్రభుత్వం వ్యతిరేక మీడియా కూడా జగన్ తీసుకోబోయే నిర్ణయం రాష్ట్రానికి భారీ ఎత్తున నష్టం తెచ్చేదేంటూ వండి వారుస్తున్న కథనాలు కూడా పరిస్థితి తీవ్రతను మరింతగా పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు నిర్ణయం ప్రకటించడం, మూడు రాజధానులను ప్రకటించడం ద్వారా ప్రజల ఆగ్రహావేశాలకు గురి కావడం అనేది తథ్యమనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. అదే సమయంలో న్యాయపరమైన సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఎవరైనా కోర్టుకు వెళ్తే.. ఏ ప్రాతిపదికన రాజధానిని మార్చారంటూ .. కోర్టులు ప్రశ్నిస్తే.. ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది.
ఈ విషయంలో తడబడితే.. మొదటికే మోసం వస్తుంది. దీనిని గుర్తించిన జగన్ సర్కారు చాలా పకడ్బందీ వ్యూహంతో మొత్తంగా రెండు కమీటీల రిపోర్టులను వీటిని అధ్యయనం చేసేందుకు మంత్రులతో కూడిన హైపవర్ కమిటీని నియమించడం వంటి కీలక నిర్నయం తీసు కుంది. కమిటీ రిపోర్టులను, హైపవర్ కమిటీ సిఫారుసులను కేబినెట్ మీటింగ్‌లో పెట్టి, చర్చించి ఆమోదించడం ద్వారా వివాదాల కు దూరంగా విషయాన్ని తేల్చుకునేందుకు జగన్ సర్కారు రెడీఅయిందనేది వాస్తవం. ఇక, ఇదంతా జరిగేందుకు మరో 10-15 రోజులకు పైగా సమయం పడుతున్నందున అప్పటికి దీక్షలు, నిరసనల జోరు తగ్గడంతోపాటు ప్రజల్లో ఆలోచనా శక్తి కూడా పెరగడం ఖాయం.
అదే సమయంలో విశాఖలో సెంటిమెంట్‌ను కూడా తెరమీదికి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే.. ప్రస్తుతం అత్యంత క్లిష్టంగా ఉన్న రాజధాని సమస్యను జగన్ తనదైన వ్యూహంతో సర్దుబాటు చేయడంతోపాటు తాను నిర్ణయించిన విషయాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనడంలో సందేహం లేదు.