నిజమే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో.. రెండు ప్రభుత్వాల్లో కొన్ని సారూప్యతలు కనిపిస్తున్నాయి. తెలంగాణ సీఎంగా టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యవహరిస్తుండగా.. ఆయన కేబినెట్ లో ఆయన కుమారుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అదే మాదిరిగా ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా వ్యవహరిస్తుండగా… ఆయన కేబినెట్ లో వైసీపీ యువనేత మేకపాటి గౌతం రెడ్డి కీలక మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అటు కేటీఆర్, ఇటు మేకపాటికి కేటాయించిన మంత్రిత్వ శాఖలను చూస్తుంటే… ఈ ఇద్దరూ వారి వారి కేబినెట్లలో కీలక మంత్రులేనని చెప్పక తప్పదు.
ముందుగా కేటీఆర్ విషయానికి వస్తే… కేసీఆర్ కేబినెట్ లో పలు కీలక శాఖలకు కేటీఆరే నిర్వహిస్తున్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ మంత్రిగా కూడా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ తొలిసారి సీఎంగా బాద్యతలు చేపట్టిన తరుణంలో ఐటీ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కేటీఆర్… ఆ తర్వాత పరిశ్రమల శాఖను కూడా చేపట్టేశారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను విజయపథంలో నడిపిన కేటీఆర్… పురపాలక శాఖను కూడా తన చేతి కిందకే తెచ్చేసుకున్నారు. మొత్తంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే అన్ని శాఖలకు కేటీఆరే మంత్రి.
ఇక ఏపీలో కూడా మేకపాటి గౌతం రెడ్డి.. జగన్ కేబినెట్ లో కీలక శాఖలకు మంత్రిగా కొనసాగుతున్నారు. పది నెలల క్రితం ఏపీకి సీఎంగా జగన్ పదవీ ప్రమాణం చేసి… తన కేబినెట్ లోకి మేకపాటిని తీసుకుని పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ తదితర శాఖలను అప్పగించారు. ఈ శాఖల నిర్వహణలో జగన్ తనపై పెట్టుకున్న అంచనా మేరకు పనిచేసిన మేకపాటి తనదైన సత్తాను నిరూపించుకున్నారనే చెప్పాలి. ఈ విషయాన్ని గమనించిన జగన్… తాజాగా మేకపాటికి అదనంగా పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖలను కూడా అప్పగించేశారు. మొత్తంగా రాష్ట్రం రూపురేఖలను మార్చేసే అవకాశం ఉన్న అన్ని శాఖలు ఏపీలో ఇప్పుడు గౌతంరెడ్డికే దక్కాయని చెప్పాలి. అందుకే… తెలంగాణలో కేటీఆర్ కీలక మంత్రి అయితే… ఏపీలో ఆ స్థాయి ప్రాధాన్యం గౌతం రెడ్డికి దక్కిందని చెప్పక తప్పదు.