రాజకీయ వ్యూహాలు పసిగట్టడం చాలా కష్టం అంటారు కానీ.. కొన్నికొన్ని సందర్భాల్లో మాత్రం పసిగట్టడం ఈజేనే అనిపిస్తుంటుం ది. ఇప్పుడు ఏపీలో చోటు చేసుకున్న పరిణామాల వెనుక కూడా ఊహించడం పెద్దగా కష్టం కాకపోవడం గమనార్హం. అసలు కలలో కూడా ఊహించని విధంగా దేశంలోనే అతి పెద్ద ఇండస్ట్రియలిస్టు.. ముఖేష్ అంబానీ.. హఠాత్తుగా ఏపీకి రావడం.. అది కూడా సీఎం జగన్‌ను కలవడం.. అందునా రెండు గంటలపాటు ఆయనతో కలిసి చర్చించడం.. వంటివి నిజంగా చూసేవారికి చాలా ఆశ్చర్యం గాను.. ప్రతిపక్ష నాయకులకు కంటగింపుగాను అనిపించింది. దీంతో అంబానీ అంత హడావుడిగా ఏపీకి రావడం ఎందుకు ? అనే కోణాన్ని వదిలేసి.. విపక్షాలు మరో యాంగిల్‌ను పట్టుకున్నాయి.
ముఖేశ్ అంబానీ… ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. తిరుపతిలో రిలయెన్స్ ఏర్పాటు చేసే స్థలం వివాదంలో ఉంది. ఈ స్థలాన్ని గత ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలంలోని కొంత భాగాన్ని ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రిలయెన్స్ తన పెట్టుబడులను ఉపసంహరించుకుంటుదని కూడా విసృతంగా ప్రచారం జరిగింది. ఈ తరుణంలోనే ముఖేశ్ అంబానీతో మాట్లాడాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇందుకోసం వైసీపీ ఎంపీ విజయసా యిరెడ్డి.. ముఖేశ్ అంబానీకి సంబంధించిన కొంతమంది ప్రతినిధులతో చర్చించారు.
తాడేపల్లిలోని జగన్ నివాసానికి రావాలని ఆహ్వానం ఇచ్చారు.ఈ క్రమంలో వచ్చారని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ చర్చలకు, కేంద్రంలోని బీజేపీకి మధ్య అవినాభావ సంబంధం ఉందని అంటున్నారు. కేంద్రమే రాజ్యసభ సీటు కోసం వైసీపీ దగ్గరకు పంపించిందని, కేంద్రంలోని బీజేపీతో వైసీపీ తెరచాటు స్నేహం చేస్తోందని టీడీపీ వర్గాలు అప్పుడే సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టాయి. వైసీపీకి ఉన్న నాలుగు సీట్లలో బీజేపీ ఒకటి తనకు కేటాయించాలని కోరిందని, అది కూడా ప్రముఖ పారిశ్రామిక దిగ్గజంఅంబానీ మిత్రుడు పరిమళ్‌కు ఇవ్వాలని పరోక్షంగా సూచించిందని, ఈ క్రమంలోనే ఈ చర్చ కోసం అంబానీ నేరుగా విజయవాడలో వాలిపోయారని అంటున్నారు.
ఈ క్రమంలో దీనిని సానుకూలంగా కొన్ని కథనాలు కూడా సోషల్ మీడియాలో తెరమీదికి వచ్చాయి. దీనిని అందిపుచ్చుకున్న టీడీపీ.. బీజేపీకి వైసీపీ ఉన్న అవినాభావ సంబంధానికి ఇంతకన్నా నిదర్శనం ఏం ఉంటుందని వ్యాఖ్యాలు ప్రారంభించింది. సో.. ఈ పరిణామాలు నిజమైతే.. జగన్, అంబానీల భేటీ వెనుక బీజేపీ ఉందనే అనుకోవాలని అంటున్నారు పరిశీలకులు.