తననుతాను ఎక్కువ ఊహించుకుంటున్న ప్రభాస్‌..?

-

‘సాహో’ కొట్టిన దెబ్బ నిజానికి మామూలుగా తగల్లేదు. అయినా ప్రభాస్‌ తగ్గట్లేదు. ఇలా రెండు మూడు ఏళ్లకోసారి ఓ సినిమా వస్తే, ఇంకో ఏడాదిలో అందరు ప్రభాస్‌ను మరిచిపోవడం ఖాయం. అనుష్కతో సహా..


ప్రభాస్‌… యంగ్‌ రెబెల్‌స్టార్‌గా తెలుగు సినిమాలో ఎంతో పేరు తెచ్చుకున్న హీరో. సినిమా సినిమాకి ఎంతో పరిణితిని కనబర్చి, తనకంటూ పెద్ద మార్కెట్‌ను సృష్టించుకున్న కథానాయకుడు. దర్శక దిగ్గజం రాజమౌళితో రెండు / మూడు చిత్రాలు చేసి చిరస్మరణీయమైన విజయాలను సాధించాడు.

2002లో ‘ఈశ్వర్‌’తో తన కెరీర్‌ను ప్రారంభించిన ప్రభాస్‌, 2019 వరకు 19 సినిమాలు చేసాడు. ఓ రెండు సినిమాల్లో గెస్ట్‌ కూడా. 2004లో వచ్చిన ‘వర్షం’తో ప్రభాస్‌కు గట్టి బేస్‌ ఏర్పడింది. ఆరడుగుల ఆజానుబాహుడు, అమ్మాయిల మనసులను ఇట్టే దోచుకునే అందగాడుగా భారీ చరిష్మా సంపాదించాడు. మధ్యలో కొన్ని సినిమాలు యావరేజ్‌గా పేరు తెచ్చుకున్నా, ‘డార్లింగ్‌’, ‘మిస్టర్‌.పర్‌ఫెక్ట్‌’… లవర్‌బాయ్‌ ఇమేజిని కూడా కట్టబెట్టాయి. ఆ తర్వాత 2013లో ‘మిర్చి’… ఇండస్ట్రీలోనే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దర్శకుడు కొరటాల శివ తొలి చిత్రంగా ‘మిర్చి’ని మలిచిన తీరు సర్వత్రా ప్రశంసలు పొందింది. అసలు ప్రభాస్‌ అయితే ఎంతో అందంగా, మగాళ్లకే మరులు గొలిపేంతగా మెరిసిపోయాడు. ఆ సినిమా చూసిన ఆడపిల్లలందరూ మూకుమ్మడిగా ప్రభాస్‌ను ఆరాధించడం మొదలెట్టేసారు. ‘మిర్చి’, ప్రభాను ‘స్టాచ్యూ ఆఫ్‌ రెబెల్‌’గా నిలబెట్టింది. ఇదంతా ఒక ఫేజ్‌. మరో ఫేజ్‌ 2015లో మొదలైంది.

10 జులై 2015… ది గ్రేట్‌ రాజమౌళి సృష్టించిన మొదటి సునామీ ‘బాహుబలి-1’ విడుదలైన రోజు. ఆ సినిమా సునామీలో యావద్భారతదేశం కొట్టుకుపోయింది. కొట్టాయం నుండి కాశ్మీరం దాకా, పుల్లలేరుకునే వ్యక్తి దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా, అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా జనమంతా బాహుబలి పూనకంతో ఊగిపోయారు. థియేటర్లలో పూలవర్షం, బాక్సాఫీసుల్లో కనకవర్షం కురిపించి, తెలుగు సినిమా ప్రమాణాలను నిర్వచించింది. రాత్రికి రాత్రే, దర్శకుడు, హీరో జాతీయస్థాయి సెలెబ్రిటీలుగా మారిపోయారు. ఒక్క దెబ్బతో ఈ ‘ఈశ్వర్‌’, వందల కోట్లీశ్వరుడిగా నిలబడ్డాడు. దర్శకధీరుడు రాజమౌళి సత్తా ఏంటో ప్రపంచానికి బాగా తెలిసొచ్చింది. అప్పటిదాకా, భారత్‌లో గొప్ప దర్శకులుగా పేరుగాంచిన మణిరత్నం, శంకర్‌, ఆశుతోష్‌ గోవారికర్‌, సంజయ్‌లీలీ బన్సాలీ లాంటి మహామహులను ఒక్క సినిమాతో మరిపించాడు మౌళి. సహజంగానే కొందరు దర్శకులకు ఇది తీవ్ర అసూయాద్వేషాలను రగిలించింది. అందులో అగ్రగణ్యుడు శంకర్‌. అద్భుతమైన చిత్రరాజాలను అందించిన శంకర్‌, ‘బాహుబలి’ కంటే గొప్ప సినిమా తాను మాత్రమే తీయగలననిభావించి తీసిన ‘రోబో 2.0’ మట్టిగొట్టుకుపోయింది. తానే ఎంతో అద్భుతంగా తీసిన ‘రోబో’ ముందు ఈ సీక్వెల్‌ ఎందుకు కొరగాకుండాపోయింది.


అలాగే, ఎంత కాదనుకున్నా, దక్షిణాది సినిమాలన్నా, ఇక్కడి హీరోలు, దర్శకులన్నా, ఉత్తరాది వారికి చిన్నచూపెక్కువ. హీరోయిన్లంటే మాత్రం మక్కువ ఎక్కువ. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ఉంది. కమలహాసన్‌, రజనీకాంత్‌, చిరంజీవి, మమ్ముట్టి, మోహన్‌లాల్‌, నాగార్జున వంటి ఎందరో పెద్ద హీరోలు హిందీ సినిమాలలో నటించినా, వాటిని వారు ఆదరించలేదు. వారిని అక్కున చేర్చుకోలేదు. అంతెందుకు? గాన గంధర్వుడు బాలసుబ్రమణ్యాన్ని కూడా ఎదగనివ్వలేదు. అలాంటి హిందీ పరిశ్రమకు కూడా వందల కోట్లు కట్టబెట్టింది ‘బాహుబలి’.

ఇక 2017లో కొనసాగింపుగా వచ్చిన ‘బాహుబలి-2’, అదే ప్రభంజనాన్ని కంటిన్యూ చేసింది. ముందునుంచీ ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను క్యాష్‌ చేసుకుని అదే మ్యాజిక్‌ను రిపీట్‌ చేసింది. దేశవిదేశాల్లో వందలాది కోట్టను వసూలు చేసి, ఎనలేని కీర్తిప్రతిష్టలను మూటగట్టుకుంది. ఇక రాజమౌళి సినిమా అంటేనే యావత్ప్రపంచం ఆసక్తిగా చూడటం మొదలైంది. ఇక్కన్నుంచే అసలు కథ కూడా మొదలైంది. అది ప్రభాస్‌ కథ.

బాహుబలి సిరీస్‌ కథానాయకుడిగా ప్రభాస్‌కు కూడా దేశవ్యాప్తంగా మంచి ఇమేజ్ వచ్చింది. అయితే బాహుబలి సక్సెస్‌ క్రెడిట్‌ మాత్రం నిర్ద్వందంగా రాజమౌళిదే. తాను దర్శకత్వం వహించిన అన్ని సినిమాలలో హీరోను బాగా ఎలివేట్‌ చేయడంలో రాజమౌళి సిద్ధహస్తుడు. కథ అవసరం మేరకే కథానాయకుడిని ఎంచుకుంటాడు. బాహుబలిలో కథానాయకుడు రాజు. ఆజానుబాహుడు, స్ఫురద్రూపి అయిఉండాలి. కాబట్టే ప్రభాస్‌ హీరో కాగలిగాడు. దాన్ని అంతవరకే వదిలేయాలి. తన ఇమేజ్‌ ఏమిటో, మార్కెట్‌ ఎంతో, తన అన్ని సినిమాల్లోంచి బాహుబలిని తీసేసి లెక్కేసుకోవాలి. ఇక్కడే ప్రభాస్‌ తప్పులో కాలేసాడు. తననుతాను ఎక్కువగా ఊహించుకున్నాడు.

బాహుబలి క్రెడిట్‌ అంతా తనే అని అనుకున్నాడు. అవసరం లేకపోయినా, వందల కోట్ల బడ్జెట్‌, రెండేళ్లకు పైగా సమయం పెట్టుబడిగా పెట్టి ‘సాహో’ తీసాడు. ఫలితం…? అవకాశం దొరకగానే హిందీవాళ్లు ఆ సినిమాను నేలక్కొట్టారు. ఏ లైన్‌అయితే, ‘అజ్ఞాతవాసి’గా ఫెయిలయిందో అదే లైన్‌ను పట్టుకుని తీసి అపజయాన్ని మూటగట్టుకున్నాడు. అయినా, మళ్లీ అదే దారిలో ప్రయాణిస్తూ, రెండేళ్ల నుంచి ఇంకో సినిమా నడిపిస్తున్నాడు. ఇన్నేళ్ల గ్యాప్‌ రావడం ఏ హీరోకు కూడా మంచిది కాదు. నిజానికి బాహుబలి-2 తర్వాత ఒక చిన్న సినిమా చేసుండాల్సింది. అంటే తొందరగా విడుదల చేసేవిధంగా. జనం ఎవరినైనా చాలా తొందరగా మర్చిపోతారు. అందునా, అపజయాల్లో ఉన్నవారినైతే మరీనూ. ఇప్పటికే 40ఏళ్ల వయసు మీద పడింది. ఇంకా ఎన్ని సినిమాలు తీయగలడు? ఎంతకాలం తీయగలడు? మహేశ్‌బాబు లాంటోడే రిస్క్‌ తీసుకోకుండా, పాన్‌ఇండియా అని అనకుండా శుభ్రంగా తెలుగులో చేసుకుంటూ వెళ్తుంటాడు. ఏడాదిలోపు ఒకటి వచ్చేలా చూసుకుంటాడు.

ఇప్పటికైనా ప్రబాస్‌ వాస్తవాలు గ్రహించి, నేలకు దిగి ఇంతకుముందు లాగే మంచి సినిమాలు చేసుకుంటూపోతే, పదికాలాలపాటు నిలబడగలడు. లేకపోతే ఇలాగే రెండుమూడేళ్లకోటి తీసి, అది రెండుమూడు రోజులే ఆడిపోతే, జనాలు రెండుమూడు రోజుల్లో పక్కన పెట్టేస్తారు. నిర్ణయం తన చేతుల్లోనే…..

– రుద్రప్రతాప్‌

Read more RELATED
Recommended to you

Exit mobile version