రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు జమిలి ఎన్నికలు రావాలి! అప్పుడు కానీ, ఏపీ ప్రజలకు పట్టిన దరిద్రం వదల దు!- ఇదీ నిన్నటికి నిన్న ఓ మీడియా ఇంటర్వ్యూలో మాజీ ఎంపీ, టీడీపీలో ఉన్నారో లేదో కూడా తెలియ ని సందిగ్ధంలో ఉన్న సీనియర్ పొలిటీషియన్ సబ్బం హరి వ్యాఖ్య. నిజానికి కొన్నాళ్ల కిందట కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలే వినిపించేవి. జమిలి ఎన్నికలకు జై కొట్టింది టీడీపీ నే అంటూ అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. జమిలి ఎన్నికలు రావాల్సిందే.. అంటూ.. ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు బాబు నోటి నుంచి వచ్చిన ఆ మాటే.. సబ్బం హరి నోటి నుంచి వెలువడింది.
వాస్తవానికి జమిలి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన కేంద్రానికి ఉంటే కదా? ఇవన్నీ సాధ్యమయ్యేది. ఈ విష యాన్ని కేంద్రాన్నే అడిగి ఉంటే బాగుండేది. కానీ, ఉన్నట్టుండి.. రాష్ట్రంలో జమిలి ఎన్నికలు మాట తె చ్చారంటే.. దీనివెనుక ఉన్న వ్యూహం. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పక్కదారి పట్టించడమే! ప్రస్తుతం కరోనా నియంత్రణకు ప్రభుత్వం అనేక రూపాల్లో ప్రయత్నాలు చేస్తోంది. ఇంత వరకు పక్కనే ఉన్న అనేక రాష్ట్రాలు కూడా చేయని విధంగా ఏపీలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. భారీ ఎత్తున నిధులు ఖర్చు చేస్తోంది.
దీంతో ప్రభుత్వానికి సానుకూలంగా వార్తలు వస్తున్నాయి. జాతీయ మీడియాలోనూ ప్రభుత్వంపై అడగ కుండానే వార్తలు రాస్తున్నారు. అయితే, ఈ విషయంలో ఏదో ఒక రకంగా ప్రజల దృష్టిని మరల్చాలనే ప్రధాన ఉద్దేశంతో సబ్బం హరిఈ వ్యాఖ్యలు చేసినట్టు భావించాల్సి ఉంటుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు, గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన జమిలి ఎన్నికల పేరుతో తిరిగి పోటీ చేసి మరోసారి తన జాతకం పరిశీలించుకోవాలని భావిస్తున్నట్టుగా ఉందని అంటున్నారు.
ఆయన మాటలు పెద్ద పొలిటికల్ జోకుల్లా ఉన్నాయన్న సెటైర్లు కూడా పడుతున్నాయి. నిజానికి సబ్బం హరి చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా పసలేదని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మాత్రానికి రెండు గంటల పాటు ఆయన ఊకదంపుడు ఇంటర్వ్యూ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి జమిలి ప్రకటన వెనుక చాలా వ్యూహమే ఉందని చెబుతున్నారు.