ఏప్రభుత్వమైనా.. తప్పు చేసిన వారిని ఒదిలి పెట్టకూడదనేది న్యాయపరంగా చేపట్టాల్సిన ప్రక్రియ అని రాజ్యాంగమే చెబుతోంది. అయితే, దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు ఇలానే వ్యవహరిస్తున్నాయా? అంటే చెప్పడం కూడా కష్టమే. కానీ, ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఇక్కడి ప్రభుత్వం గత టీడీపీ హయాంలో దూకుడుగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటోంది. వారిని ఏదో ఒక విధంగా క్రమ శిక్షణ పేరుతో లేదా ప్రబుత్వ విచక్షణాధికారాల పేరుతో చర్యలు తీసుకుంటోంది. గతంలో కృష్టా జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించిన బాబుకు చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వలేదు.
పోస్టింగ్ ఇచ్చినా.. జీతం ఇవ్వకుండా తొక్కిపెట్టారు. ఇక, బాబు హయాంలో డీజీపీగా పనిచేసి, వైసీపీ నేతల పై చీటికీ మాటికీ కేసులు పెట్టిన ఠాగూర్ పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే. ఆయన కనీసం ఇప్పుడు సో దిలో కూడా లేకుండా పోయారు. ఇక, జగన్ పై కేసులు పెట్టిన వ్యవహారంలో కేంద్రం చెప్పినట్టు ఆడిన మరో అధికారిపైనా ఇప్పుడు క్రమశిక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్లదీ ఇదే పరిస్థితి.
మొత్తానికి చూస్తే.. జగన్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో దూకుడు ప్రదర్శించిన అధికారులపై ఏదో ఒక రూపంలో చర్యలు తీసుకుంటోందనేది పబ్లిక్ టాక్. మరి ఇది జగన్‌కు మంచిదేనా ? రాజకీయంగా కీడేమైనా జరుగుతుందా ? ప్రతిపక్షం టీడీపీ ఇప్పుడు జగన్ చర్యలను బూచిగా చూపించి రాజకీయంగా దెబ్బకొట్టే కార్యక్రమాలకు తెరదీస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, వాస్తవానికి ఏ ప్రభుత్వానికైనా ఉద్యోగులపై చర్యలు తీసుకునే అదికారం, అవకాశం రెండూ ఉంటాయి. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం పక్కా ఆధారాలతో వారిపై చర్యలు తీసుకుంటోంది.
తాజాగా ఏబీ వెంకటేశ్వరరావుపై తీసుకున్న చర్యల వెనుక కూడా ఇదే తరహా ఆధారాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంలో దూకుడు కన్నా కూడా నిజనిర్ధారణకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం అనేది కీలకంగా మారనుంది. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అదే చేస్తోంది. నిజ నిర్ధారణ మేరకే అధికారులపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. దీనిని తప్పు పట్టాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. బహుశ అందుకేనేమో..మిగిలిన విపక్షాలు కూడా ఈ విషయంలో మౌనం పాటిస్తున్నాయి.