పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. ఆ దేశ ప్రజలు తినడానికి తిండి లేక ఆకలితో అల్లాడుతున్నారు. ఆహార సంక్షోభం కూడా తలెత్తడంతో అక్కడి సర్కార్ ప్రజల ఆకలి తీర్చడానికి అష్టకష్టాలు పడుతోంది. తాజాగా పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సు జిల్లాల్లో ఉచితంగా గోధుమ పిండి పంపిణీ చేసే కేంద్రాల వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ
పంజాబ్‌లోని సాహివాల్, బహవల్పూర్, ముజఫర్‌గఢ్, ఒకారా, ఫసైలాబాద్, జెహానియన్, ముల్తాన్ జిల్లాల్లోని కేంద్రాల వద్ద ఇటీవల కాలంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ తొక్కిసలాటల్లో మొత్తం 11 మంది ప్రజలు మృత్యువాతపడ్డారని అధికారులు వెల్లడించారు. తాజాగా మంగళవారం ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. నగదు కొరతతో ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం పంజాబ్ ప్రావిన్సులో పేదల కోసం ఉచిత పిండి పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్రాల వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తుండటంతో తొక్కిసలాటలు జరుగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.