పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా పడి, మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సులో ఉన్న వారిలో 12 మంది విద్యార్థులతో పాటు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మరో ఏడుగురు పిల్లలు గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. గౌటెంగ్ ప్రావిన్సులోని మోరాఫంగ్ పట్టణంలో బుధవారం రోజున ఈ దుర్ఘటన జరిగింది.
సెలవుల అనంతరం బడులను తెరచిన ఒకరోజు వ్యవధిలోనే ఈ ఘోరం జరగడం గమనార్హం. దీంతో ఆ విద్యార్థుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఏడుగురు చిన్నారుల్ని ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనపై స్థానికులను అధికారులు ఆరా తీశారు. బస్సును ఓ చిన్న ట్రక్కు వెనుక నుంచి ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న క్షతగాత్రులను అధికారులు పరామర్శించారు. కాగా, దక్షిణాఫ్రిలో అత్యధిక జనాభా కలిగిన ప్రావిన్స్ గౌటెంగ్. ఇక్కడ పాఠశాలకు వెళ్లేందుకు వేల మంది విద్యార్థులు ప్రైవేటు మినీ బస్సులను ఆశ్రయిస్తారు.