ఆఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల అరాచకం రోజురోజుకు పెరిగిపోతోంది. అధికారం కైవసం చేసుకున్నప్పటి నుంచి తాలిబన్లు మహిళలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. కొద్ది నెలల క్రితం మహిళలను మాధ్యమిక విద్యతోపాటు, యూనివర్శిటీలో చదువులకు దూరం చేస్తూ ఆదేశాలు జారీ చేసిన తాలిబన్ సర్కార్.. ఆ తర్వాత దూర ప్రయాణాలు, బ్యూటీ సెలూన్లపై నిషేధం విధించింది. ఇక తాజాగా, హిజాబ్ ధరించని మహిళలను బమియాన్‌లోని బంద్-ఈ-అమిర్ జాతీయ పార్కు సహా దేశంలోని ఇతర జాతీయ పార్కుల్లోకి అనుమతించకూడదని నిర్ణయించింది.
ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని తాలిబన్ ప్రభుత్వం వైస్ అండ్ వర్చ్యు మినిస్ట్రీ (ఇస్లామిక్ చట్టాల అమలు శాఖ) మంత్రి మహ్మద్ ఖలీద్ హనాఫీ సిబ్బందికి సూచించారు. మహిళలు పార్కులను సందర్శించడం తప్పనిసరి కాదని హనాఫీ.. హిజాబ్ సరిగా ధరించని మహిళలను జాతీయ పార్కులోకి అనుమతించకూడదని సిబ్బందికి సూచించారు. అవసరమైతే వారిని అడ్డుకునేందుకు బలప్రయోగం చేయాలని ఆదేశించినట్లు తాలిబన్ అధికార ప్రతినిధి మహ్మద్ సాధిఖ్ అఖిఫ్ వెల్లడించారు.