కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై ప్రస్తుతం రాష్ట్రంలో వాడివేడిగా చర్చ నడుస్తోంది. ఈ డిక్లరేషన్‌పై బీఆర్ఎస్ నేతలు వరుసగా విమర్శలు కుప్పిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విటర్) వేదికగా విమర్శించగా.. తాజాగా ఎమ్మెల్సీ కవిత కూడా ఈ విషయంపై స్పందించారు. కామారెడ్డిలో బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్సీ కవిత.. కాంగ్రెస్ విడుదల చేసిన దళిత డిక్లరేషన్‌పై మాట్లాడారు.
కాంగ్రెస్ దళిత డిక్లరేషన్ ఒక బూటకమని కవిత అన్నారు. ఎస్సీల మీద కాంగ్రెస్ ఎక్కడా లేని ప్రేమ ఒలకబోస్తోందని.. కాంగ్రెస్ ఎన్నో ఏళ్లుగా ఎస్సీలను పేదరికంలోనే ఉంచిందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ చేస్తున్న పనులనే కాంగ్రెస్ కాపీ కొడుతోంది.. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా చెప్పింది చేయలేదని వ్యాఖ్యానించారు.
మరోవైపు.. హంతకులే వచ్చి దండ వేసి కన్నీళ్లు కార్చినట్లుంది బీజేపీ వైఖరి అని కవిత అన్నారు. రాష్ట్రంలో రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ చూస్తోందని.. బీజేపీ, కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ఎమ్మెల్యే అభ్యర్థులే లేరని చెప్పారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తారని కవిత పురనుద్ఘాటించారు.