పార్లమెంటులో ఏలియన్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

మెక్సికో పార్లమెంట్​లో ఏలియన్లు కలకలం సృష్టించినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. అయితే అవి నిజమైన ఏలియన్లు కాదట.. పార్లమెంటులో వేల ఏళ్ల ఏలియన్ల అవశేషాలు ప్రదర్శించారనే వార్తలు వచ్చాయి. అయితే అది పూర్తిగా అవాస్తవమని మెక్సికోలోని ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఆస్ట్రానమీ పరిశోధకురాలు జూలియాటా ఫియరో తేల్చారు. మానవులా? కాదా? అన్న విషయాన్ని నిర్ధరించడానికి ఎక్స్ కిరణాల కంటే అధునాతనమైన సాంకేతికత అవసరమని తెలిపారు. ఆ అవశేషాలను పెరూ నుంచి సేకరించగా.. కనీసం ఆ దేశ రాయబారిని ఆహ్వానించకపోవడం వింతగా ఉందని అన్నారు.

చట్టసభలో మంగళవారం రోజున జర్నలిస్ట్‌, యూఫోలజిస్ట్ జైమ్ మౌసాన్ ఏలియన్‌ అవశేషాలను ప్రదర్శించారు. రెండు చెక్క పెట్టెల్లో ఉన్న ఏలియన్స్‌ అవశేషాలను మెక్సికో పార్లమెంట్​లో తెరిచి చూపించారు. వంకర తలతో, కుచించుకోపోయిన శరీరంతో ఉన్న ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఈ రెండు గ్రహాంతర జీవుల శిలాజ అవశేషాలను వేల ఏళ్ల కిందట పెరూలోని కుస్కో నుంచి వెలికితీసినట్టు మౌసాన్ చెప్పారు. ఇవి మన భూగోళానికి చెందినవి కావని.. డయాటమ్ (ఆల్గే) గునుల్లో బయటపడిన శిలాజ అవశేషాలని తెలిపారు.