అమెరికాలోని మైన్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన భీకర కాల్పుల ఘటనలో 18 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని అక్కడి పోలీసులు గుర్తించి అతడి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అయితే ఆ నిందితుడు ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత అనుమానాస్పదంగా మృతి చెందడం ఇప్పుడు కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి ఆ నరహంతకుడి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అది ఆ వ్యక్తి శవమేనని ధ్రువీకరించారు.
అసలేం జరిగిందంటే.. గత బుధవారం రాత్రి మైన్ రాష్ట్రంలోని లెవిస్‌టన్‌లోని ‘టెన్ పిన్ బౌలింగ్’ వేదిక వద్ద ఓ వ్యక్తు కాల్పులు మొదలుపెట్టాడు. ఈ కాల్పుల్లో దాదాపు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేసి నిందితుడు 40 ఏళ్ల రాబర్ట్ కార్ట్ అని గుర్తించారు. పరారీలో ఉన్న రాబర్ట్ కోసం పోలీసులు గాలింపు షురూ చేశారు. అతడి చేతిలో ఇంకా ఆయుధం ఉన్న నేపథ్యంలో మళ్లీ కాల్పులకు తెగబడి అమాయకుల ప్రాణాలు తీస్తాడేమోనన్న అనుమానంతో పోలీసులు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే శుక్రవారం రోజున రాబర్ట్ మృతదేహం కనిపించడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.