హమాస్ ను సమూలంగా నాశనం చేయడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో విధ్వంసం నెలకొంది. ఈ నేపథ్యంలో యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో మానవతా సాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్ ఈరోజు ప్రకటించింది.
ఇందులో భాగంగా ఉత్తర గాజాలో కీలకమైన సరిహద్దును తిరిగి తెరుస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఈ మేరకు ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చలు జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం రావడం గమనార్హం.
అయితే గాజాలో యుద్ధం, మానవతా సాయం అందిస్తున్న సిబ్బందిపై దాడి వంటి విషయాలపై నెతన్యాహు, బైడెన్ గురువారం చర్చించారు. సామాన్య పౌరులు, సహాయక సిబ్బంది రక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని. లేకపోతే భవిష్యత్తులో తమ సహకారం ఉండకపోవచ్చునని బైడెన్ తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.